Doda Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు (Terrorist) పేట్రేగిపోతున్నారు. గత నెల రోజులుగా భద్రతా బలగాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. వారి దాడుల్లో ఎంతో మంది జవాన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే దోడా (Doda) జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఆఫీసర్‌తో సహా నలుగురు సైనికులు వీర మరణం పొందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ పోలీసులు అప్రమత్తమయ్యారు. దోడా ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఆ ప్రాంతంలో దాడులకు పాల్పడుతున్న ముగ్గురు ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలను పోలీసులు శనివారం విడుదల చేశారు. ఉగ్రవాదులు దోడా జిల్లాలోని దేసా ఏరియా అడవుల్లో దాగి ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే వారిని పట్టుకునేందుకు రివార్డు కూడా ప్రకటించారు (Reward Announced). ఫొటోల్లో ఉన్న ఉగ్రవాదుల గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ.5లక్షల నగదు బహుమతి ప్రకటించారు.
కాగా, జులై 15న దోడాజిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఎన్కౌంటర్ సందర్భంగా ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో ఒక ఆఫీసర్‌తో సహా నలుగురు సైనికులు వీర మరణం పొందారు. మరణించిన వాళ్లలో డార్జిలింగ్‌కు చెందిన కెప్టెన్ బ్రిజేశ్ థాపా, ఏపీకి చెందిన నాయక్ డీ రాజేశ్, రాజస్థాన్‌కు చెందిన సిపాయిలు బిజేంద్ర, అజయ్ కుమార్ సింగ్ ఉన్నారని ఆర్మీ అధికారులు మంగళవారం వెల్లడించారు. దాడి తామే చేశామని పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్ సంస్థకు షాడో గ్రూపు ‘ది కశ్మీర్ టైగర్స్’ ప్రకటించింది. ఉగ్రవాదులు దోడా జిల్లాలోని దేసా ఏరియా అడవుల్లో దాగి ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సోమవారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో రాత్రి 9 గంటల సమయంలో తారసపడిన టెర్రరిస్టులకు ఎదురు కాల్పులకు పాల్పడ్డారని ఆర్మీ 16 కార్ప్స్ ఎక్స్ పోస్టులో వెల్లడించింది. ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడగా, వీరిలో నలుగురు మరణించారని అధికారులు తెలిపారు. జమ్ము రీజియన్‌లో గత 32 నెలల వ్యవధిలో ఉగ్రదాడుల్లో 48 మంది ఆర్మీ జవాన్లు మరణించారు.
Also Read..
Amarnath Yatra | అమర్నాథ్ యాత్రకు ఉగ్ర ముప్పు.. విధ్వంసానికి ఐఎస్ఐ కుట్ర
Tihar Jail | తీహార్ జైలులో గొడవ.. ఇద్దరు ఖైదీలకు గాయాలు
Encounter | జమ్మూ కశ్మీర్లో మరోసారి ఎదురుకాల్పులు.. జవాను మృతి..!