న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీతో పాటు దేశంలోని 23 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సమీక్ష(సర్) ప్రక్రియ చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్టు డైలీ జాగరణ్ న్యూస్ వెబ్సైట్ నివేదిక తెలిపింది. దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే వారంలో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, కేరళ తదితర రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన దరిమిలా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ‘సర్’ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నది.
నిజానికి ఈ ప్రక్రియ గడచిన ఏప్రిల్లోనే చేపట్టాల్సి ఉన్నప్పటికీ, వివిధ రాష్ర్టాల్లో ఎన్నికల నిర్వహణ కారణంగా జాప్యం జరిగింది. ఇప్పుడు ఈ ప్రక్రియ తిరిగి ప్రారంభించడంపై ఎన్నికల సంఘం వచ్చే వారంలో అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.