చెన్నై, నవంబర్ 9: రాష్ట్రంలోని ఓటరు లిస్టుల ప్రక్షాళనకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)ను తాము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నామని, ఇది అంతా ఒక కుట్ర అని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆరోపించారు. తాము సర్‌ను ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ వివరిస్తూ ఆయనోవీడియోను విడుదల చేశారు. ఎలాంటి పారదర్శకత లేకుండా సర్‌ను ఆదరాబాదరాగా చేపట్టారని ఆయన ఆరోపించారు. ‘సరైన, ప్రామాణిక ఓటరు జాబితా నిష్పాక్షిక ఎన్నికలకు ఆధారం. మేము ఓటరు జాబితా సవరణను వ్యతిరేకించడం లేదు.
ఎన్నికలకు కొద్ది నెలల సమయం ఉండగా, ఎలాంటి సమయం ఇవ్వకుండా ఇలా తొందరగా దీని ని చేపట్టడం ఎంత మాత్రం సబబు కాదు. ఓటరు లిస్టుల విషయంలో ఎన్నికల సంఘంతో బీజేపీ కుమ్మక్కయ్యిందన్న విషయాన్ని ఇది స్పష్టం చేస్తున్నది’ అని ఆయన పేర్కొన్నారు. సర్ గురించి ప్రకటించగానే తాము దీనిని వ్యతిరేకించామని, దీనిని సవాల్ చేస్తూ తాము సుప్రీంను ఆశ్రయించామని, నవంబర్ 11న జిల్లా కేంద్రాల్లో నిరసన వ్యక్తం చేయనున్నట్టు ఆయన చెప్పారు.