కాసిపేట : మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కాసిపేట 1 ఇంక్లైన్, కాసిపేట 2 ఇంక్లైన్ గనులపై టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వాస్తవ లాభాలపై వాటా ఇవ్వకుండా సింగరేణి కార్మికులకు జరిగిన మోసంపై మండిపడ్డారు. ఈ సంధర్భంగా కాసిపేట 1 ఇంక్లైన్ గనిపై టీబీజీకేఎస్ ఫిట్ సెక్రెటరీ బైరి శంకర్, కాసిపేట 2 గనిపై టీబీజీకేఎస్ నాయకులు సారంగపాణి వేర్వేరుగా మాట్లాడారు.
వాస్తవ లాభాలు రూ.6,394 కోట్లకు రూ.2360 కోట్లు మాత్రమే ప్రకటించి రూ.4034 కోట్లు పక్కకు పెట్టడం అంటే సింగరేణి కార్మిక వర్గాన్ని ఆర్థిక దోపిడికి గురిచేయడమేనని అన్నారు. రూ.5 లక్షలు లాభాల వాటా రావాల్సిన కార్మికునికి రూ.1.95 లక్షలకే పరిమితం చేయడం సింగరేణి కార్మిక వర్గం శ్రమను దోచుకోవడమేనని ఆరోపించారు. గత ఏడాది సింగరేణి అభివృద్ధికి పక్కన పెట్టిన డబ్బులు ఏమయ్యాయో తెలియదన్నారు.
ఈ ఏడాది లాభాల్లో 34 శాతం వాటా చెల్లిస్తామన్నామని చెప్పి రూ.6,394 కోట్లలో రూ.2,960 కోట్లనే లాభంగా చూపారని, దాంతో కార్మికులకు వాస్తవంగా లాభాల్లో 12.8 శాతం వాటా మాత్రమే దక్కినట్లయ్యిందని చెప్పారు. ఇలాంటి ప్రక్రియ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రమే మొదలైందని ఎద్దేవాచేశారు. దీనిపై పోరాడాల్సిన గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు స్పందించకుండా కార్యక్రమంలో పాల్గొనడం శోచనీయమన్నారు.
కేవలం టీబీజీకేఎస్ మాత్రమే కార్మికుల పక్షాన ఉండి పోరాడుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు కారుకూరి తిరుపతి, పోషం, శివ, సతీష్, యాదగిరి, వెంకటేష్, రాజేశం, బాలాజీ, భాస్కర్, రాజయ్య, కాసిపేట 1వ గనిపై బండారి రమేశ్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.