భోపాల్: సచివాలయంలోని మంత్రి కార్యాలయం నుంచి దేవుడి విగ్రహాలు మాయమయ్యాయి. (idols stolen from minister’s office) అత్యంత భద్రత ఉండే తన కార్యాలయం నుంచి అవి చోరీ కావడంతో ఆ మంత్రి షాక్ అయ్యారు. మంత్రి సెక్యూరిటీ అధికారి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఈ సంఘటన జరిగింది. భోపాల్‌లోని మంత్రాలయం మూడో అంతస్తులో ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ చాంబర్ ఉన్నది. ప్రతి రోజు అక్కడకు చేరుకున్న తర్వాత తన క్యాబిన్‌లోని చిన్నవైన వెండి వినాయకుడు, లక్ష్మీ విగ్రహాలకు ఆయన పూజ చేస్తుంటారు.
కాగా, కొన్ని రోజుల కిందట మంత్రి గోవింద్ సింగ్ తన కార్యాలయానికి వచ్చారు. అయితే అందులో ఉండాల్సిన చిన్నవైన వెండి వినాయకుడు, లక్ష్మీ విగ్రహాలు కనిపించలేదు. దీంతో షాకైన ఆ మంత్రి వాటి గురించి తన సిబ్బందిని అడిగారు. ఫలితం లేకపోవడంతో మంత్రి సెక్యూరిటీ అధికారి దీని గురించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మరోవైపు అత్యంత భద్రత ఉండే మంత్రి క్యాబిన్ ముందున్న సీసీటీవీల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. అయితే దొంగను ఇంకా గుర్తించలేదు. కాగా, అత్యంత సెక్యూరిటీ ఉండే మంత్రాలయంలోని మంత్రి వ్యక్తిగత క్యాబిన్ నుంచి దేవుడి విగ్రహాలు చోరీ కావడం, అక్కడి భద్రత డొల్లతనంపై విమర్శలు వెల్లువెత్తాయి.
Also Read: