బెంగళూరు: రోడ్డుపై నిలిచిన వర్షం నీటిలో వెళ్తున్న కారు మరో కారుపై నీటిని చిమ్మింది. దీంతో ఇద్దరు కారు యజమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీయడంతో ఒక కారు యజమాని చేతి వేలును మరో కారు వ్యక్తి కొరికాడు. (Man Bites Another Man’s Finger) బాధిత వ్యక్తి భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. మే 25న రాత్రి 9 గంటల సమయంలో జయంత్ శేఖర్ తన భార్యతో కలిసి కారులో ఇంటికి వెళ్తున్నాడు. లులు మాల్ అండర్పాస్ దగ్గర సిగ్నల్ దాటిన తర్వాత కారు మలుపు తిరిగింది. అక్కడ రోడ్డుపై నిలిచిన వర్షం నీరు మరో కారుపై చిమ్మింది.
కాగా, ఆ కారులోని వ్యక్తి, మహిళ దీనిపై ఆగ్రహించారు. జయంత్ శేఖర్ కారును అడ్డుకున్నాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో జయంత్ శేఖర్ కుడి చేతి వేలిని ఆ వ్యక్తి కొరికాడు. ఆ వేలికి సర్జరీ కోసం రెండు లక్షలు ఖర్చు అయ్యిందని జయంత్ శేఖర్ వాపోయాడు.
మరోవైపు ఈ సంఘటనపై శేఖర్ భార్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తన భర్త వేలు కొరకడంతోపాటు తమను చంపుతామని ఆ కారులోని వ్యక్తి బెదిరించినట్లు ఆరోపించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘర్షణకు సంబంధించి నిందితుడి నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీస్ అధికారి తెలిపారు.
Also Read: