మాండ్య: కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రాక ముందు తనకు, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు మధ్య అధికారం పంచుకోవడంపై ఎలాంటి ఒప్పందం జరగలేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. ‘ముఖ్యమంత్రి ఏది చెబితే అదే ఫైనల్’ అంటూ శివకుమార్ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఆయన మాట్లాడుతూ అది ఇప్పుడు లేదని చెప్పారు.
అధిష్ఠానం ఆదేశాల మేరకే తాను నిర్ణయం తీసుకుంటానని అన్నారు. కాగా, గురువారం హసన్‌లో కాంగ్రెస్ పార్టీ, స్వాభిమనిగల ఒక్కుట (అణగారిన వర్గాల సమాఖ్య సంస్థలు) సంయుక్తంగా సదస్సు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముడా కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సిద్ధరామయ్యకు సంఘీభావంగా అణగారిన వర్గాల సమాఖ్య సంస్థలు ఈ సదస్సు నిర్వహించాలని భావించినా, దాని నిర్వహణలో కాంగ్రెస్ భాగస్వామి అయ్యి సంయుక్తంగా నిర్వహిస్తుండటంతో సిద్ధూ బల ప్రదర్శనకు గండిపడిందని భావిస్తున్నారు.