CM Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. సీఎం మార్పు అంటూ జరిగిన ప్రచారంలో నిజం లేదని తేలింది. సీఎం సిద్ధరామయ్యే ఫుల్ టైం సీఎంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసినట్లు సమాచారం. కర్ణాటకలో సీఎం మారుతారు అంటూ చాలా రోజులుగా ప్రచారం జరుగుతోంది. సిద్ధరామయ్య స్థానంలో డీకే శివకుమార్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపడుతారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటు సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. ఢిల్లీలో మంగళవారం కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిశారు.
కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, మరో అగ్రనేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. ఇతర నేతలు సిద్ధరామయ్య, డీకేలతో భేటీ అయ్యారు. దీంతో సీఎం పదవి నుంచి ఆయనను మారుస్తారా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ.. అసలు తాము ఈ అంశంపైనే చర్చించలేదన్నారు. రాబోయే రాజ్యసభ ఎన్నికలపైనే చర్చించినట్లు చెప్పారు. దీంతో కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యే కొనసాగుతారని స్పష్టమైంది. కాకపోతే.. కాంగ్రెస్ వర్గాల నుంచి వేరే ప్రచారం మొదలైంది. సీఎంగా సిద్ధరామయ్యను తప్పుకోవాలని హైకమాండ్ కోరినట్లు ప్రచారం జరుగుతోంది. సీఎం పదవి నుంచి తప్పుకొంటే రాజ్యసభలో అవకాశం కల్పిస్తామని, అలాగే భవిష్యత్‌లో మంచి పదవి ఇస్తామని, జాతీయ రాజకీయాల్లో స్థానం కల్పిస్తామని హైకమాండ్ చెప్పినట్లు సమాచారం.
ఇతర అంశాలు, పార్టీలోని సమస్యల్ని తమకు వదిలేయమని హైకమాండ్ చెప్పిందని తెలుస్తోంది. త్వరలో రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే పదవీ కాలం ముగియనుంది. ఆయన స్థానంలో సిద్ధరామయ్యను తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. హైకమాండ్ సూచనపై సిద్ధరామయ్య ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.