Rajasthan | జైపూర్, మే 29: పెండ్లికి ముందు ప్రియుడితో వెళ్లిపోయిన యువతిని ‘నిన్నే పెళ్లాడుతా’ అంటూ భీష్మించిన ఒక వరుడు ఆమె ఇంట్లోనే 13 రోజల పాటు వేచి ఉండి ఆమెనే పెండ్లాడిన వింత ఘటన రాజస్థాన్‌లోని సైనా గ్రామంలో చోటు చేసుకుంది. పెండ్లికూతురు మనీషాను వివాహం చేసుకునేందుకు మే 3న శ్రావణ్ కుమార్ ఆమె ఇంటికి చేరుకున్నాడు. కొద్ది నిముషాల్లో పెండ్లి అనగా మనీషా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ప్రేమికుడితో వెళ్లిపోయిందని నిర్ధారణకు వచ్చారు. మనీషా ఇంటికి వస్తే ఆమెను వివాహం చేసుకుంటానంటూ శ్రావణ్ కుమార్ భీష్మించాడు.
ఆమె కోసం వారి ఇంట్లోనే 13 రోజులు వేచి ఉన్నాడు. అలంకరించిన పెండ్లి మండపాన్ని అలాగే ఉంచారు. ఈలోగా వెళ్లిపోయిన వధువు కోసం గాలింపు చేపట్టిన పోలీసులు ఆమెను వెతికి పట్టుకుని మే 15న తల్లిదండ్రులకు అప్పగించారు. తర్వాత ఆమెను శ్రావణ్‌తో పెళ్లికి ఒప్పించారు. దీనికి ఆమె సైతం ఓకే అంది. దీంతో మనీషా కోసం 13 రోజుల పాటు ఆమె ఇంట్లోనే వేచి చేసిన శ్రావణ్‌తో సంప్రదాయబద్ధంగా మే 16న బంధువులు వివాహం జరిపించడంతో కథ సుఖాంతమైంది.