Puducherry | దేశంలో జాతీయ విద్యా విధానంలోని (ఎన్ఈపీ-2020) త్రిభాషా సూత్రంపై రాజకీయ దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. కొత్త విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులు నేర్చుకోవాలని కేంద్రం స్పష్టం చేస్తోంది. మూడింట్లో రెండు భారతీయ భాషలు ఉండాలని చెబుతోంది. అయితే, కేంద్రం నిర్ణయంపై కొన్ని రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. హిందీని బలవంతంగా రుద్దడం ఏంటని..? మండిపడుతున్నాయి. ఈ విషయంలో ముఖ్యంగా కేంద్రం, తమిళనాడులోని అధికార డీఎంకే మధ్య గత కొంత కాలంగా వివాదం కొనసాగుతోంది. ఈ వివాదం వేళ కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరి (Puducherry) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
రాష్ట్రంలోని దుకాణాలు, వ్యాపార సముదాయాల సైన్బోర్డులపై పేర్లు తమిళం (Tamil)లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు సూచనలు చేస్తూ సర్క్యూలర్ జారీ చేయనున్నట్లు పుదుచ్చేరి సీఎం (Puducherry Chief Minister) ఎన్ రంగసామి వెల్లడించారు. మంగళవారం అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా సీఎం ఈ ప్రకటన చేశారు. త్రిభాషా విధానంపై స్వతంత్ర ఎమ్మెల్యే జి నెహ్రూ అలియాస్ కుప్పుసామి అసెంబ్లీలో లేవనెత్తారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. ‘యజమానులు తమ దుకాణాలు, వ్యాపార సముదాయాల సైన్ బోర్డులపై తమిళ పేర్లు ప్రదర్శించేలా సూచనలు చేస్తూ సర్క్యులర్ జారీ చేస్తాం’ అని స్పష్టం చేశారు.
Also Read..
Gold Seize | షాకింగ్.. అహ్మదాబాద్లో 100 కిలోల బంగారం పట్టివేత
Criminal Cases | దేశంలో 45 శాతం మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు.. టాప్ ప్లేస్లో ఏపీ
PM Modi | భారత్ శక్తిని ప్రపంచం మొత్తం చూసింది.. కుంభమేళా విజయంపై ప్రధాని మోదీ