ఇంఫాల్/అగర్తలా, జూన్ 4: ఈశాన్య రాష్ర్టాల్లో కొంచెం అటుఇటుగా గత లోక్‌సభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే రిపీట్ అయ్యాయి. అయితే గత ఏడాది మే నుంచి రెండు జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న బీజేపీ అధికారంలో ఉన్న మణిపూర్‌లో ఎన్డీయే కూటమి రెండు లోక్‌సభ స్థానాలను కోల్పోయింది. 2019 ఎన్నికల్లో ఇన్నర్ మణిపూర్‌ను బీజేపీ, ఔటర్ మణిపూర్‌ను ఆ పార్టీ మిత్రపక్షం నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్పీఎఫ్) గెలుచుకోగా.. ఈసారి ఆ రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకొన్నది.
మరోవైపు 14 లోక్‌సభ స్థానాలు ఉన్న అస్సాంలో గత ఎన్నికల మాదిరిగానే బీజేపీ తొమ్మిది, కాంగ్రెస్ మూడు స్థానాల్లో విజయం సాధించాయి. అరుణాచల్‌లో రెండు ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకొన్నది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అరుణాచల్ వెస్టు నుంచి కాంగ్రెస్ అభ్యర్థి నబం టుకిపై లక్షకు పైగా ఓట్ల మెజార్టీతో గెలిచారు. నాగాలాండ్ లోక్‌సభ స్థానాన్ని 20 ఏండ్ల తర్వాత కాంగ్రెస్ గెలుచుకొని చరిత్ర సృష్టించింది.
త్రిపురలో రెండు స్థానాలను బీజేపీ నిలబెట్టుకొన్నది. మాజీ సీఎం బిప్లబ్ కుమార్ దేవ్ త్రిపుర వెస్టు నుంచి సమీప కాంగ్రెస్ అభ్యర్థి, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అశిష్ కుమార్ సాహాను ఆరు లక్షల భారీ మెజార్టీతో ఓడించారు. మిజోరంలో జడ్పీఎం అభ్యర్థి రిచర్డ్ గెలిచారు. సిక్కింలో ఉన్న ఒకే ఒక్క లోక్‌సభ స్థానాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన సిక్కిం క్రాంతికారా మోర్చా(ఎస్కేఎం) గెలుచుకొన్నది. మేఘాలయలో కాంగ్రెస్, వాయిస్ ఆఫ్ పీపుల్ పార్టీ(వీవోటీపీపీ) ఒక్కో స్థానం చొప్పున విజయం సాధించాయి.