Shivraj Singh Chouhan : విపక్ష ఇండియా కూటమి అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని కేంద్ర మంత్రి, మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. రాంచీలో ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జార్ఖండ్‌లో కాంగ్రెస్, జేఎంఎం సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
జార్ఖండ్‌లో వారు ఐదేండ్ల పాలనను పూర్తిచేసుకుంటున్నారని, ఐదేండ్ల హయాంలో వారి విజయాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. జేఎంఎం మేనిఫెస్టోలో 144 హామీలు ఇచ్చారని, కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో 317 వాగ్ధానాలు చేసిందని, వీటిలో ఐదేండ్ల పాలనలో ఎన్ని హామీలు నెరవేర్చారో వారు వెల్లడించాలని శివరాజ్ చౌహాన్ డిమాండ్ చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాంగ్రెస్, జేఎంఎం సర్కార్ తొక్కిపెట్టిందని దుయ్యబట్టారు.
సమాజంలో అన్ని వర్గాలనూ సంకీర్ణ పాలకులు విస్మరించి మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్కరికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఆరోపించారు. ఎలాంటి హామీ లేకుండా ఏ ఒక్క మహిళకూ వారు రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. ఈ ఏడాది జరగనున్న జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో పాలక కూటమికి భంగపాటు తప్పదని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో కాషాయ పార్టీ మెరుగైన ఫలితాలు రాబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read More :
Joe Biden | అమెరికాలో రాజకీయ హింసకు చోటులేదు: జో బైడెన్