Badlapur Incident : మహారాష్ట్రలోని బద్లాపూర్‌లో స్కూల్ చిన్నారులపై లైంగిక వేధింపుల ఘటన పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన తీవ్ర విచారకరమని శివసేన (యూబీటీ) ఎంపీ ప్రియాంక చతుర్వేది అన్నారు. పాలకులు మహిళా హక్కుల కోసం పోరాడతామని, వారికి న్యాయం చేస్తామని ప్రతిసారీ చెబుతుంటారని, కానీ ఎన్నికలు ముగిసిన తర్వాత మహిళల సమస్యలను ఏ ఒక్కరూ వినిపించుకోరని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ముఖ్యమంత్రి లడ్కీ బహిన్ యోజన పధకం కింద ఎలాంటి ప్రయోజనాలు అవసరం లేదని, మహిళల భద్రతే ముఖ్యమని ఇవాళ బద్లాపూర్ ఘటనకు నిరసన వ్యక్తం చేస్తున్న వారు కోరుతున్నారని ఆమె వివరించారు.
ఇలా ఎంతకాలం మహిళలకు అన్యాయం చేస్తుంటారని ప్రియాంక చతుర్వేది ప్రశ్నించారు. కాగా, మహారాష్ట్రలోని థానే స్కూల్లో మూడేండ్ల వయసు కలిగిన ఇద్దరు బాలికలపై స్కూల్ క్లీనింగ్ సిబ్బంది ఒకరు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఆగస్ట్ 12-13 తేదీల్లో చిన్నారులు స్కూల్ వాష్‌రూంకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన జరగ్గా పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.
థానే జిల్లా బద్లాపూర్‌లో ఈ ఉదంతం వెలుగుచూసింది. నిందితుడు అక్షయ్ షిండేను కోర్టు మూడు రోజుల పోలీస్ రిమాండ్‌కు తరలించింది. బాలికల తల్లితండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.పోక్సో కేసులో సైతం స్ధానిక సీనియర్ పోలీస్ ఇన్స్పెక్టర్ శుభద షిటోలె ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం చేశారని బాధిత తల్లితండ్రులు, స్ధానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యులైన ప్రిన్సిపల్, క్లాస్ టీచర్, సంబంధిత సిబ్బందిని అధికారులు సస్పెండ్ చేశారు.
Read More :