న్యూఢిల్లీ : లోక్‌సభలో భద్రతా వైఫల్యం (Security Breach in Lok Sabha) పెను దుమారం రేపింది. లోక్‌సభలో బుధవారం జీరో అవర్ జరుగుతుండగా విజిటర్స్ గ్యాలరీ నుంచి ఇద్దరు ఆగంతకులు కిందకు దూకి గ్యాస్‌ను వదలడం కలకలం రేపింది. ఇద్దరు ఆగంతకులను నీలం, అమోల్ షిండే గా గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ స్పందిస్తూ ఆగంతకుల దుశ్చర్యతో సభలో కలకలం రేగిందని, అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని చెప్పారు. ఆగంతకులు కిందకు దూకినప్పుడు చివరి బెంచీల్లో సభ్యులు ఎవరూ లేకపోవడంతో వారిని సులభంగా పట్టుకున్నారని అన్నారు. కాగా లోక్‌సభలో ఆగంతకులు గ్యాస్ వదలడం తీవ్ర భద్రతా వైఫల్యమని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం అన్నారు.
సభ జరుగుతుండగా అనూహ్యంగా 20 ఏండ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకి పసుపు రంగు గ్యాస్‌ను వదిలారని చెప్పారు. వారు కొన్ని నినాదాలు చేశారని, వారు వదిలిన గ్యాస్ విష వాయువు కావచ్చని, ఇది తీవ్ర భద్రతా వైఫల్యమని కార్తీ చిదంబరం పేర్కొన్నారు. 2001లో డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి జరగ్గా సరిగ్గా ఇదే రోజు ఈ ఘటన జరగడం గర్హనీయమని, ఇది ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని కార్తీ చిదంబరం వ్యాఖ్యానించారు.
Read More :
Parliament attack | పార్లమెంట్‌పై ఉగ్రదాడికి 22 ఏళ్లు.. అమరులకు నివాళులర్పించిన నేతలు