Sanjay Raut | మహారాష్ట్రలో గత పది రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు తెరపడింది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnvais) పేరు ఖరారైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని బీజేపీ బుధవారం అధికారికంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎంలుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ఎన్నికయ్యారు. ఇవాళ సాయంత్రం 5:30 గంటలకు ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శివసేన (యూటీబీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఇక షిండే శకం ముగిసింది’ అని వ్యాఖ్యానించారు.
ఏక్నాథ్ షిండే (Eknath Shinde)ని బీజేపీ ఇన్ని రోజులూ ఉపయోగించుకుందని.. ఇప్పుడు మాత్రం పక్కకు నెట్టేసిందని వ్యాఖ్యానించారు. ‘షిండేని బీజేపీ పావులా వాడుకుంది. ఇప్పుడు పక్కకు నెట్టేసింది. ఇక షిండే శకం ముగిసింది. ఆయన మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేరు. ఆయన అవసరం కూడా బీజేపీకి లేదు. అవసరమైతే షిండే పార్టీని కూడా బీజేపీ విచ్ఛిన్నం చేయగలదు. ఇది ప్రధాని మోదీ రాజకీయ పంథా’ అని సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మహాయుతికి స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ.. 15 రోజులైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయారని రౌత్ అన్నారు. అంటే వారి కూటమిలో ఏదో లోపం ఉందని అర్థమవుతోందన్నారు. అది ఇవాళ కాకపోయినా తర్వాతైనా బయటకి వస్తుందని చెప్పుకొచ్చారు.
కాగా, బుధవారం విధాన్ భవన్లో జరిగిన సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌ను బీజేపీ ఎల్పీ నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కానున్నారని, మహారాష్ట్రలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఏర్పడుతున్నట్టు బీజేపీ పరిశీలకులు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, విజయ్ రూపాని ప్రకటించారు. దీంతో ఫడ్నవీస్, ఏక్నాథ్ సిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని మహాయుతి ప్రతినిధి బృందం బుధవారం సాయంత్రం గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరింది. గురువారం సాయంత్రం 5.30 గంటలకు దక్షిణ ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీఏ పాలిత రాష్ర్టాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు.
ఉప ముఖ్యమంత్రులుగా షిండే, పవార్
ఫడ్నవీస్‌తో పాటు ఉప ముఖ్యమంత్రులుగా శివసేన నేత, మాజీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునేందుకు మొదట షిండే మొండికేశారు. ఆయనను డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాల్సిందిగా బీజేపీ అధిష్ఠానం, ఫడ్నవీస్ పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఆయన స్పందించలేదు. చివరకు బుధవారం సాయంత్రం అంగీకరించిన షిండే.. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని ప్రకటించారు.
Also Read..
Air Pollution | ఢిల్లీలో మెరుగుపడిన గాలి నాణ్యత.. 165గా ఏక్యూఐ లెవల్స్
Devendra Fadnvais | నేడే సీఎంగా ప్రమాణం.. సిద్ధి వినాయక ఆలయంలో ఫడ్నవీస్ ప్రత్యేక పూజలు
Virat Kohli | కోహ్లీ ఫిట్నెస్ సీక్రెట్ బయటపెట్టిన అనుష్క.. ఆ మూడింటికే అధిక ప్రాధాన్యం