Loksabha Elections 2024 : ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ప్రజలు ఓటుతో దీటైన సమాధానం ఇస్తారని ప్రముఖ నటుడు, అసన్సోల్ టీఎంసీ అభ్యర్ధి శత్రుఘ్న సిన్హా అన్నారు. ప్రధాని మోదీ అభ్యంతరకర భాష వాడటం యాధృచ్ఛికం కాదని, గతంలోనూ ఆయన దీదీ ఓ దీదీ అంటూ సీఎంను అవమానిస్తే రాష్ట్ర ప్రజలు దీటుగా బదులిచ్చారని, ఈసారి కూడా బెంగాల్ ప్రజలు మోదీకి గట్టిగా బుద్ధిచెబుతారని స్పష్టం చేశారు.
టీఎంసీ అభ్యర్ధులను భారీ మెజారిటీతో బెంగాల్ ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. అసన్సోల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి శత్రుఘ్న సిన్హా మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. బెంగాల్లో సీఎం మమతా బెనర్జీ చేసిన అభివృద్ధి పనులే తమ పార్టీ అభ్యర్ధులను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తమ రోడ్‌షోకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించిందని, ప్రజలు తమ పట్ల అత్యంత ఆదరణ, ఆప్యాయతలను కనబరిచారని పేర్కొన్నారు.
మమతా బెనర్జీ చేసిన పనులే తమను గెలిపిస్తాయని, ఇవాళ బెంగాల్ ఆలోచించిన తరహాలోనే భారత్ కూడా ఆలోచిస్తుందని అదే జరుగుతుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం దీదీ కష్టపడిన విధంగా మరే సీఎం పనిచేయలేదని మమతా బెనర్జీపై ప్రశంసల జల్లు కురిపించారు. ఎన్డీయేకు ఈ ఎన్నికల్లో కేవలం 150 నుంచి 175 స్దానాలు మాత్రమే లభిస్తాయని అన్నారు. ఇక పశ్చిమ బెంగాల్‌లోని 42 స్ధానాలకు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Read More :
KTR | శ్రీరాముడు బీజేపీ ఎంపీనో, ఎమ్మెల్యేనో కాదు.. ఆయన అందరివాడు : కేటీఆర్