Shashi Tharoor : సొంత రాష్ట్రమైన కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన కీలక సమావేశానికి ఆ పార్టీ అగ్ర నేత శశి థరూర్ హాజరు కాలేదు. దీనిపై ఆయన స్పందిస్తూ.. ఈ అంశంపై తాను పార్టీ నేతలతోనే మాట్లాడతానని, బయట మాట్లాడబోనని చెప్పారు. కాంగ్రెస్ సీనియర్ నేతల్లో ఒకరైన శశి థరూర్ వ్యవహారం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీకి ఆయన కొంతకాలంగా అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
కేరళలోని తిరువనంతపురం నుంచి కాంగ్రెస్ తరఫున శశి థరూర్ ఎంపీగా కొనసాగుతున్నారు. త్వరలో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలపై ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు శుక్రవారం సమావేశం నిర్వహించారు. కేరళకు చెందిన పలువురు కీలక నేతలు, జాతీయ స్థాయి నేతలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ వంటి నేతలు కూడా పాల్గొన్నారు. కానీ, కేరళకే చెందిన శశి థరూర్ మాత్రం వెళ్లలేదు. దీనిపై మీడియా ఆయనను ప్రశ్నించింది. కేరళ లిటరేచర్ ఫెస్టివల్ కు హాజరైన ఆయనను ఈ అంశంపై విలేకరులు ప్రశ్నలు అడిగారు. దీనికి శశి స్పందిస్తూ.. ఇది రాజకీయ వేదిక కాదని, ఏదైనా సమస్య ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే తేల్చుకుంటానని చెప్పాడు. ‘‘రాజకీయ అంశాలు మాట్లాడటానికి ఇది వేదిక కాదు. ఇది సాహిత్య వేడుక. నాకు మా పార్టీతో ఉన్న సమస్యల గురించి పార్టీ నాయకత్వంతోనే మాట్లాడుతా. బహిరంగంగా, ఇలాంటి ప్రజా వేదికలపై మాట్లాడను.
నేను 17 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. ఏదైనా తప్పు జరిగితే వాటిని గుర్తించి పరిష్కరించుకుంటాం. సరైన వేదికల మీదే దాని గురించి మాట్లాడుతాను. ఇప్పటికే ఈ అంశంపై మీడియాలో రకరకాలుగా ప్రచారం జరిగింది. అందులో కొంత నిజం ఉంటే.. ఇంకొంత అబద్ధం ఉంది. నేను ఆ మీటింగ్ కు హాజరవ్వకపోవడానికి గల కారణాలపై మాట్లాడను. ఈ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇచ్చాను’’ అని థరూర్ వ్యాఖ్యానించారు. కొంతకాలం క్రితం ఆపరేషన్ సిందూర్ కు మద్దతుగా, బీజేపీకి అనుకూలంగా శశిథరూర్ మాట్లాడారు. అయితే, ఇదే అంశంపై బీజేపీని కాంగ్రెస్ తీవ్రంగా విమర్శిస్తోంది. ఒకవైపు ఆపరేషన్ సిందూర్ వ్యవహారంలో బీజేపీ వైఖరిని కాంగ్రెస్ తప్పుబడుతుంటే.. శశి థరూర్ సమర్ధించారు. దీంతో ఆయనకు, కాంగ్రెస్ కు మధ్య గ్యాప్ వచ్చిందని అంచనా.