Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీలో సీనియర్, అగ్రనేతల్లో ఒకరైన శశి థరూర్.. ఈ మధ్య ఆ పార్టీకి కాస్త దూరంగా ఉన్నట్లు కనిపిస్తోంది. తాజాగా ఆయన పార్టీకి షాకిచ్చారు. ఢిల్లీలో నిర్వహించిన పార్టీ సమావేశానికి డుమ్మా కొట్టి.. తన రాష్ట్రంలో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి శశి థరూర్ హాజరవ్వడం ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత అయిన శశి థరూర్.. కేరళలోని తిరువనంతపురం నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున ఎంపీగా కొనసాగుతున్నారు.
2009 నుంచి ఆయన అక్కడి నుంచే కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. పార్టీలో ఇంత సీనియారిటీ ఉన్నప్పటికీ.. ఇటీవల తనకు తగిన గౌరవం దక్కడం లేదనే అభిప్రాయంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పలు సందర్భాల్లో బీజేపీని, మోదీని పొగుడుతూ వస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై పరోక్షంగా విమర్శలు చేస్తున్నారు. దీంతో ఆయనకు, కాంగ్రెస్ పార్టీకి మధ్య దూరం పెరిగినట్లు కనిపిస్తోంది. ఇక తాజాగా.. కేరళలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల సమాయత్తం కోసం శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలక సమావేశం నిర్వహించింది. కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులతోపాటు, కేరళ నేతలు పాల్గొన్నారు. కానీ, కేరళకే చెందిన అగ్రనేతగా గుర్తింపున్న శశి థరూర్ మాత్రం ఈ సమావేశానికి హాజరుకాలేదు.
అంతేకాదు.. తన పార్లమెంట్ నియోజకవర్గమైన తిరువనంతపురంలో ప్రధాని మోదీ సభకు హాజరయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమవుతూ, బీజేపీకి దగ్గరవుతున్నారా అనే సందేహం మొదలైంది. అయితే, ఈ అంశంపై కాంగ్రెస్ వర్గాలు స్పందించాయి. శశి థరూర్ కాంగ్రెస్ సమావేశానికి రాలేనని ముందుగానే సమాచారం ఇచ్చినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. తన సొంత నియోజకవర్గంలో మోదీ పాల్గొంటుండటంతో దీనికి హాజరయ్యేందుకు ఆయన కాంగ్రెస్ అనుమతి తీసుకున్నారని వెల్లడించారు.