Cyclone Shakti : అరేబియా సముద్రం (Arabian Sea) లో శుక్రవారం ఏర్పడిన శక్తి సైక్లోన్ (Shakti Cyclone) ఇవాళ తీవ్ర తుఫాను (Severe cyclone) గా మారిందని భారత వాతావరణ విభాగం (IMD) వెల్లడించింది. అయితే ఈ తుఫాను భారత తీరానికి దూరంగా పశ్చిమ దిశగా కదులుతోందని ఐఎండీ తెలిపింది. దాంతో భారత పశ్చిమ తీరానికి ముప్పు తప్పినట్లేనని స్పష్టంచేసింది.
గడిచిన ఆరు గంటలుగా ఈ శక్తి తుఫాను గంటకు 13 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ దిశగా కదులుతోందని ఐఎండీ అధికారులు తెలిపారు. ఇప్పుడు తీవ్ర తుఫానుగా మారడంతో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని వెల్లడించారు. ప్రస్తుతం సైక్లోన్ శక్తి ద్వారకకు పశ్చిమం వైపు 420 కిలోమీటర్ల దూరంలో, పాకిస్థాన్‌లోని కరాచీకి పశ్చిమ దిశగా 290 కిలోమీటర్ల ఉందని చెప్పారు.
కాగా శక్తి తుఫాను ఈ ఏడాది అరేబియా సముద్రంలో ఏర్పడిన తొలి తుఫానుగా నిలిచింది. రెండు రోజుల క్రితం అరేబియా సముద్రంలో ఈశాన్యం వైపు ద్వారకకు 240 కిలోమీటర్ల దూరంలో, పోరుబందర్‌కు 270 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది.
అది వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారింది. ఇవాళ తీవ్ర తుఫానుగా మారి పశ్చిమదిశగా కదులుతోంది.