చండీఘడ్: చండీఘడ్‌లోని అనేక ప్రైవేటు స్కూళ్ల(Chandigarh Schools)కు ఇవాళ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళనకు గురయ్యారు. సుమారు అయిదు ప్రైవేటు స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు తెలుస్తోంది. సెయింట్ కబీర్, వివేక్ హై, భవన్ విద్యాలయ, సేక్రడ్ హార్ట్, చిత్కారా స్కూళ్లకు బెదిరింపు వచ్చినట్లు భావిస్తున్నారు. కొన్ని ప్రభుత్వ స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. ఈ నేపథ్యంలో చండీఘడ్‌లో ఎమర్జెన్సీ సైరన్లను మోగించారు. బాంబు బెదిరింపు మెయిల్స్ రాగానే స్కూల్ యజమానులు ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. స్కూళ్లను పోలీసులు ఖాళీ చేయించారు. విద్యార్థులను బయటకు పంపారు. విద్యార్థులను ఇండ్లకు పంపించారు. బాంబు బెదిరింపుల నేపథ్యంలో చండీఘడ్ పరిపాలనా శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఆందోళనకు గురికావొద్దు అని, ప్రశాంతంగా ఉండాలని స్కూళ్లను ప్రభుత్వం కోరింది. పూర్తి స్థాయిలో చెకింగ్ నిర్వహించేందుకు అన్ని లొకేషన్లకు బాంబు స్క్వాడ్లను పంపారు.