కొత్తగూడెం ప్రగతి మైదాన్, జూలై 26 : మావోయిస్టులకు బలమైన ప్రాంతాలుగా ఉన్న జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌లలో వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ అబూజ్మడ్ అడవుల్లో, జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లో ఏడుగురు నక్సలైట్లు మరణించారు. అబూజ్‌మడ్‌లో మూడు దిక్కుల నుంచి జవాన్లు చొచ్చుకురావడంతో వారి ధాటికి తాళలేక మావోయిస్టులు కాల్పులు జరుపుతూనే పారిపోయారు.
శనివారం ఉదయం జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారని పోలీసు అధికారులు తెలిపారు. మృతులు నిషేధిత సీపీఐ(మావోయిస్ట్) నుంచి చీలిపోయిన ‘జార్ఖండ్ జన ముక్తి పరిషత్’ గ్రూప్ సభ్యులుగా అధికారులు గుర్తించారు.