భోపాల్: పోలీస్ అధికారికి చెందిన పెంపుడు కుక్క తప్పిపోయింది. దీనిపై ఆగ్రహించిన ఆయన కానిస్టేబుల్‌ను చెప్పు, బెల్ట్‌తో కొట్టాడు. కులపరంగా దూషించాడు. (Senior Beats Cop After Dog Missing) బాధిత కానిస్టేబుల్, అతడి భార్య ఫిర్యాదుపై పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు. ఆ అధికారిని సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆగస్ట్ 23న కానిస్టేబుల్ రాహుల్ చౌహాన్ డ్యూటీ తర్వాత రాత్రి పది గంటలకు తన క్వాటర్స్‌కు చేరుకున్నాడు.
కాగా, ఆ రోజు అర్ధరాత్రి తర్వాత 1.30 గంటలకు రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ) సౌరభ్ సింగ్ కుష్వాహా ఆ కానిస్టేబుల్‌ను తన అధికార నివాసానికి పిలిపించాడు. ఆయన పెంపుడు కుక్క కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. కానిస్టేబుల్ రాహుల్ చౌహాన్ నిర్లక్ష్యం వహించినట్లు ఆరోపించాడు. చెప్పు, బెల్ట్‌తో అతడ్ని కొట్టాడు. కులపరంగా దూషించాడు. అయితే 20 గంటల తర్వాత ఆ పోలీస్ అధికారి కుక్క దొరికింది.
మరోవైపు ఆగస్ట్ 27న కానిస్టేబుల్ రాహుల్ చౌహాన్ భార్యతో కలిసి తనను కొట్టిన అధికారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తమకు న్యాయం జరుగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని అతడి భార్య బెదిరించింది. దీంతో జిల్లా ఎస్పీ స్పందించారు. ఆర్ఐ సౌరభ్ సింగ్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేయాలని ఆదివాసీ సంఘాలతో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. 30 గంటలపాటు ఆందోళన చేశారు.
అయితే తనపై వచ్చిన ఆరోపణలను పోలీస్ అధికారి సౌరభ్ సింగ్ ఖండించారు. ఆ రోజు రాత్రి తాను నగరంలో లేనని తెలిపారు. మద్యం సేవించిన ఆ కానిస్టేబుల్ తన పెంపుడు కుక్కపై దాడి చేశాడని, ఉద్దేశపూర్వకంగా దానిని బయట వదిలేశాడని ఆయన ఆరోపించారు.
Also Read:
US cops shoot dead Sikh man | సిక్కు వ్యక్తి కత్తితో విన్యాసాలు.. కాల్చి చంపిన అమెరికా పోలీసులు