కొత్తగూడెం క్రైం: జార్ఖండ్‌లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతులో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఇద్దరు మావోయిస్టులు సజీవంగా పట్టుబడ్డారని ఐజీ (ఆపరేషన్స్) అమోల్ వి హోంకార్ మీడియాకు వెల్లడించారు.
గువా పోలీసు స్టేషన్ పరిధిలోని లిపుంగ ఏరియా సమీపంలో ఉదయం 5 గంటల సమయంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. దాడుల ప్రణాళికలు రచించేందుకు లిపుంగ అడవుల్లో మావోయిస్టులు సమావేశం అవుతున్నారనే విశ్వసనీయ సమాచారం భద్రతా బలగాలకు అందించింది. దీంతో పోలీసులు, కోబ్రా 209 బెటాలియన్, సీఆర్పీఎఫ్ సంయుక్త సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో లిపుంగ అడవుల్లో తారసపడిన మావోయిస్టులపై కాల్పులు జరిపారు.
సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భీకర పోరులో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. ఘటనా స్థలిలో పలురకాల ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నారు. మృతులను జోనల్ కమాండర్ కండే హోన్హాగా, సబ్ జోనల్ కమాండర్ సింగ్రాయ్ అలియాస్ మనోజ్, ఏరియా కమాండర్ సూర్య అలియాస్ ముండా దేవగమ్తో పాటు మహిళా మావోయిస్టులు జుంగ పుర్టి అలియాస్ మార్ల, సప్ని హన్స్దాగా గుర్తించారు. వీరిలో సింగ్రాయ్పై రూ.10 లక్షలు, కండేపై రూ.5 లక్షలు, సూర్యపై రూ.2 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. పట్టుబడిన మావోయిస్టులను ఏరియా కమాండర్ టైగర్ అలియాస్ పండు హన్స్దా, బత్రీ దేవగమ్గా హోంకార్ ధ్రువీకరించారు.