ఇంఫాల్: మణిపూర్లో (Manipur) రెండో దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఆరు జిల్లాల్లోని 22 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతున్నది. 92 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. రెండో దశలో పోలింగ్లో 8,47,400 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 4,18,401 మంది పురుషులు, 4,28,968 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వీరికోసం 1247 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మాజీ సీఎం ఓక్రం ఇబోబిసింగ్, ఆయన కుమారుడు సూరజ్ కుమార్, మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్ వంటి ప్రముఖులతోపాటు బీజేపీ నుంచి 22 మంది, కాంగ్రెస్ 18, జేడీయూ, నాగా పీపుల్స్ ఫ్రంట్ చెరో పది మంది, నేషనల్ పీపుల్స్ పార్టీ 11 మంది, శివసేన, ఎన్సీపీ ఇద్దరు చొప్పున, ఆర్పీఐఏ నుంచి ముగ్గురు, 12 మంది స్వతంత్ర అభ్యర్థులు రెండో విడుత బరిలో నిలిచారు. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 28న 38 స్థానాలకు మొదటి విడుత ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే.