న్యూఢిల్లీ, అక్టోబర్ 27: రెండో దశలో దేశంలోని 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల(యూటీ)లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-సర్)ను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించనున్నదని ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ సోమవారం ప్రకటించారు. నవంబర్ 4 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుందని చెప్పారు. అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ని నిర్వహించనున్నట్లు విలేకరుల సమావేశంలో ఆయన ప్రకటించారు.
వీటిలో తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పశ్చిమ బెంగాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాదే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాంలో ఓటరు జాబితాల సవరణను విడిగా ప్రకటిస్తామని సీఈసీ తెలిపారు. ‘సర్’ని విజయవంతం చేసినందుకు బీహార్‌కు చెందిన 7.5 కోట్ల మంది ఓటర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రాష్ర్టాలకు చెందిన ఎన్నికల అధికారులతో సమావేశమైన ఈసీ సర్ ప్రక్రియ గురించి సమగ్రంగా చర్చించిందని సీఈసీ తెలిపారు. 12 రాష్ర్టాలు, యూటీలకు చెందిన 51 కోట్ల మంది ఓటర్లకు సంబంధించిన ఇంటింటి సర్వే నవంబర్ 4న ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని, 2026 ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రచురిస్తామని సీఈసీ తెలిపారు.
ఇంటింటి సర్వే తప్పనిసరి
బూత్ లెవల్ అధికారులు(బీఎల్ఓ) విశిష్ఠ ఎన్యూమరేషన్ ఫారాలతో ప్రతి ఇంటిని సందర్శించి ప్రస్తుత ఓటరు జాబితా నుంచి అవసరమైన వివరాలు సేకరిస్తారని సీఈసీ చెప్పారు. బీఎల్ఓలు ఫారాలు అందచేసిన తర్వాత ఓటరు జాబితా నుంచి తమ వివరాలను ఓటర్లు తనిఖీ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్యూమరేషన్ ఫారాలలో తమ పేర్లను ఓటర్లు 2003 ఓటరు జాబితాలోని తమ పేర్లతో సరిపోల్చుకోవచ్చని ఆయన వివరించారు. 2003 జాబితాలో తమ పేర్లు లేదా తమ తల్లిదండ్రుల పేర్లు ఉన్న వారు అదనపు పత్రాలు ఏవీ సమర్పించవలసిన అవసరం లేదని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. 2002-2004 ఎస్ఐఆర్ కాలానికి చెందిన ఓటరు జాబితాలను ఈసీఐకి చెందిన వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని, ఓటరు జాబితాలోని తమ పేర్లను నేరుగా చూసుకోవచ్చని కూడా ఆయన తెలిపారు. పారదర్శకతను పాటించేందుకు ముఖ్య ఎన్నికల అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు బుధవారం కల్లా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై ‘సర్’ ప్రక్రియ గురించి వివరించాలని ఆదేశించారు.
బీజేపీతో ఈసీ కుమ్మక్కు: విపక్షాలు
‘సర్’ పేరుతో 12 రాష్ర్టాలలో ఓటు చోరీ ఆట ఆడేందుకు మోదీ ప్రభుత్వంతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యిందని ప్రతిపక్ష కాంగ్రెస్ సోమవారం ఆరోపించింది. బీహార్‌లో 69 లక్షల ఓటర్ల తొలగింపునకు దారితీసిన సర్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించి అదే ఓటరు జాబితా మోసాలకు పాల్పడేందుకు కుట్రపన్నారని ఆరోపించింది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా దేశవ్యాప్తంగా సర్ని అమలు చేయడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు తొందరపడుతోందని నిలదీసింది. అస్సాంలో సర్ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించింది. అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రయత్నాలను అడ్డుకుంటామని టీఎంసీ పేర్కొన్నది.