School Fees | న్యూఢిల్లీ : మన దేశంలోని ప్రైవేట్ స్కూళ్లు గత మూడేండ్లలో ఫీజులను దాదాపుగా రెట్టింపు చేశాయని శుక్రవారం విడుదలైన లోకల్ సర్కిల్ సర్వే వెల్లడించింది. 309 జిల్లాల్లో 31 వేల మంది తల్లిదండ్రుల నుంచి సేకరించిన వివరాల ప్రకారం 2022-2025 మధ్య ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు 80 శాతం పెరిగాయని 8 శాతం మంది అభిప్రాయపడ్డారు. 50-80 శాతం పెరిగాయని 36 శాతం మంది చెప్పారు. 30-50 శాతం పెంపుదల కనిపించిందని 8 శాతం మంది, 10-30 శాతం పెంచారని 27 శాతం మంది చెప్పారు.
కేవలం 8 శాతం మంది మాత్రమే తమ పిల్లల ఫీజుల్లో ఎలాంటి పెరుగుదల లేదని పేర్కొన్నారు. ప్రైవేట్ స్కూళ్ల ఫీజులను నియంత్రించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు నిస్సహాయంగా ఉన్నాయని అనేక మంది తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయమై 16 వేల మందిని ప్రశ్నించగా.. కేవలం 7 శాతం మంది మాత్రమే ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు.