రాష్ర్టాలదే నిర్ణయమని మాట మారుస్తారా?
మోదీ సర్కారు తీరుపై సుప్రీంకోర్టు అసహనం
3 నెలల్లోగా రాష్ర్టాలతో చర్చలు జరుపాలని ఆదేశం
న్యూఢిల్లీ, మే 10: రాష్ట్రస్థాయిలో హిందువులతో సహా ఇతర మైనార్టీలను గుర్తించే అంశంపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకే అంశంపై మాటలు మారుస్తూ రెండు భిన్నమైన వైఖరులు అవలంబించడం ఏంటని ప్రశ్నించింది. ఈ విషయంలో మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు చేసి, తమ వద్దకు రావాలని జస్టిస్ ఎస్కే కౌల్, ఎంఎం సుందరేశ్ ధర్మాసనం ఆదేశించింది.
రాష్ట్రంలో సంఖ్యను బట్టి హిందువులు లేదా ఇతర కమ్యూనిటీలకు మైనార్టీ హోదా కల్పించాలా? వద్దా? అనేదానిపై రాష్ర్టాలు, యూటీలు నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు కేంద్రం ఈ ఏడాది మార్చిలో సుప్రీంకు తెలిపింది. అయితే ఈ వైఖరికి పూర్తి విరుద్ధమైన అఫిడవిట్ మోదీ సర్కార్ సోమవారం న్యాయస్థానానికి సమర్పించింది. మైనార్టీలను నోటిఫై చేసే అధికారం కేంద్రానికి ఉందని, రాష్ర్టాలు, సంబంధిత వర్గాలతో సంప్రదింపుల తర్వాత ఏదైనా నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం భిన్నమైన వైఖరులపై ధర్మాసనం స్పందిస్తూ.. మునుపటి అఫిడవిట్లో చెప్పినదాన్ని వెనక్కి తీసుకునేలా మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన అఫిడవిట్ ఎంతమాత్రం సరికాదని, సమర్థనీయం కాదని పేర్కొన్నది. మైనార్టీల గుర్తింపు అంశం అనేది దేశవ్యాప్తంగా విస్తృతమైన పరిణామాలు కలిగి ఉందని అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఆగస్టు 30వ తేదీకి వాయిదా వేసిన ధర్మాసనం, మూడు రోజుల ముందుగానే స్టేటస్ రిపోర్టు సమర్పించాలని ఆదేశించింది.