Supreme Court | పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్, మాల్దా, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో జరిగిన హింసపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయా పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం విచారించే అవకాశం ఉన్నది. హింసాకాండలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సిట్‌తో విచారణ జరిపించాలంటూ పిటిషనర్ డిమాండ్ చేశారు.
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఈ నెల 11న జరిగిన హింసపై కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని న్యాయవాది శేఖర్ ఝా పిటిషన్లో కోరారు. పశ్చిమ బెంగాల్, కేంద్ర ప్రభుత్వాలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. బెంగాల్లో జరుగుతున్న మతపరమైన, రాజకీయ హింస ఘటనలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. శాంతిభద్రతల యంత్రాంగం వైఫల్యం గురించి ప్రతివాదుల నుంచి వివరణ కోరాలని కూడా పిటిషనర్ కోర్టును కోరారు.
బాధితులకు పరిహారం, పునరావాసం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు భద్రతతో పాటు స్వేచ్ఛగా ఉండేలా.. హింస పెరగకుండా ప్రభుత్వాలు ఆపేలా చూడాలని.. ఈ మేరకు సముచితమైన ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టు కోరారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరుగనున్నది. అయితే, హింసాత్మక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలని బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌ను కలకత్తా హైకోర్టు ఇటీవల తిరస్కరించిది.
ఇదిలా ఉండగా.. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. వక్ఫ్ చట్టానికి సంబంధించిన తాజా హింసాత్మక సంఘటనలు ఏప్రిల్ 14న పశ్చిమ బెంగాల్‌లోని దక్షిణ 24 పరగణాలు జిల్లాలోని భంగర్ ప్రాంతంలో జరిగాయి. హింసాత్మక కేసులను దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనితో పాటు, రాష్ట్రంలో జరిగిన హింసను దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యుల న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయవాది విశాల్ తివారీ మరో పిటిషన్ దాఖలు చేశారు. కలకత్తా హైకోర్టు ఇటీవల హింసాకాండకు గురైన ముర్షిదాబాద్ జిల్లాలో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశించింది.