న్యూఢిల్లీ: మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగుల కోత 2025లో తీవ్రస్థాయికి చేరుకుంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,000 మందికి పైగా ఉద్యోగులపై వేటుపడింది. ఈనెల ప్రారంభంలో సంస్థ దాదాపు 9,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన నేపథ్యంలో నిర్ణయంపై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల గురువారం ఉద్యోగులకు భావోద్వేగంతో ఓ లేఖ రాశారు. కృత్రిమ మేధ(ఏఐ) కారణంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు గందరగోళానికి గురిచేస్తూ కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
తనను అమితంగా బాధిస్తున్న విషయాలను మాట్లాడదలచుకున్నానని, అదే సమయంలో ఇటీవలి ఉద్యోగాల తొలగింపుపై మీలో చాలామంది ఏం ఆలోచిస్తున్నారో కూడా తనకు తెలుసునని ఆయన తెలిపారు. దిగ్గజ కంపెనీలు సైతం దీని బారిన పడుతూ ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు మూడు విడతల్లో దాదాపు 15,000 మంది ఉద్యోగులను తొలగించామని, ఇది తనను ఎంతగానో కలచివేసిందని ఆయన తెలిపారు.
2024 జూన్ నాటికి ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య 2.28 లక్షలు ఉండగా 2025లో ఉద్యోగుల తొలగింపు తర్వాత ఆ సంఖ్య స్థిరంగానే ఉందని నాదెళ్ల తెలిపారు. సంస్థ పురోగతి ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఎప్పటికప్పుడు చలనశీలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏఐ మనకు కొత్త అవకాశాలు ఇస్తుందని, గతంలో కంటే సమర్థంగా ఐటీ రంగం ఎదగడానికి ఇది దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. మైక్రోసాఫ్ట్ భవిష్యత్తు దార్శనికతలో ఏఐ కీలక భాగమని ఆయన ఉద్యోగులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.
మైక్రోసాఫ్ట్ ఉత్పత్తులు, వ్యాపారాల్లో ఏఐతో మార్పులు చోటుచేసుకుంటున్న వేళ ఉద్యోగులు పురోగతిని దృష్టిలో ఉంచుకుని ఆలోచనలు చేయాలని ఆయన సూచించారు. కృత్రిమ మేధ కారణంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్న తరుణంలో తాను గందరగోళాన్ని ఎదుర్కొంటున్నానని, అయితే మార్పులు జరిగే సమయంలో ఇలాంటి పరిస్థితి తప్పదని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. తమ టీమ్‌లను పునర్ వ్యవస్థీకరిస్తున్నామని, దీంతో పరిధులు పెరగడంతోపాటు కొత్త అవకాశాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు.