న్యూఢిల్లీ: రైతు డిమాండ్లు నెరవేర్చాలంటూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం-నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (కేఎంఎం) దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చాయి. దేశవ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ఆగస్టు 1న బీజేపీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని, ఆగస్టు 15న ట్రాక్టర్ ర్యాలీ చేపడతామని ప్రకటించాయి. ఈ ఆందోళనల్లో రైతులు, రైతు కుటుంబాలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరాయి.
ఈ మేరకు సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. న్యూఢిల్లీలో కేఎంఎం నాయకుడు సర్వన్ సింగ్ విలేకరులతో మాట్లాడుతూ, ‘రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ ఆగస్టు 31నాటికి 200 రోజులు పూర్తిచేసుకుంటుంది. ఖానౌరి, శంభు వద్దకు రావాల్సిందిగా రైతులందర్నీ కోరుతున్నాం’ అని చెప్పారు.