Bikram Majithia | పంజాబ్ (Punjab) రాష్ట్రానికి సంబంధించిన 2021 నాటి డ్రగ్స్ కేసు (Drugs case) లో శిరోమణి అకాలీదళ్ (SAD) సీనియర్ నాయకుడు, ఆ రాష్ట్ర మాజీ మంత్రి విక్రమ్ సింగ్ మజీతియా (Bikram Singh Majithia) అరెస్టయినట్లు తెలుస్తోంది. ఇవాళ (బుధవారం) తెల్లవారుజామున విజిలెన్స్ అధికారులు అమృత్సర్ (Amritsir) లోని మజీతియా నివాసంలో ఆకస్మిక సోదాలు చేశారు.
విక్రమ్ మజీతియా శిరోమణి అకాలీదళ్ పార్టీ అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు సొంత బావ. ఆయన గతంలో పంజాబ్ రాష్ట్రమంత్రిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం ఆయన భార్య గనీవే కౌర్ మజీతియా ఎమ్మెల్యేగా ఉన్నారు. 2021 నాటి డ్రగ్స్ కేసులో విక్రమ్ మజీతియా నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సిట్.. మజీతియాకు, ఆయన కుటుంబానికి సంబంధించిన కంపెనీల్లో అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించింది.
ఈ క్రమంలో ఇవాళ విజిలెన్స్ బ్యూరో అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మజీతియా ఇంటిపైకి రైడింగ్‌కు రావడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ సందర్భంగా మజీతియా, మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కేసులో ఎవరినైనా అరెస్ట్ చేశారా..? అన్న ప్రశ్నకు అమృత్సర్ ఆర్పీఎస్ సంధూ అవునని చెప్పారు. అరెస్టయిన వాళ్లను ఇక్కడ నుంచి తీసుకెళ్లామని తెలిపారు. ప్రస్తుతం ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని అన్నారు.