Rahul Gandhi : నీట్ పేపర్ లీకేజీపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డారు. ఈ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ శుక్రవారం స్పందించారు. ‘‘నీట్ రాసిన 22 లక్షల మంది విద్యార్థులు వెన్నుపోటుకు గురయ్యారు. అయినప్పటికీ ప్రధాని మోదీ ఈ అంశంపై మౌనంగా ఉన్నారు. పేపర్ లీకేజీకి బాధ్యతగా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి.
లేదంటే ప్రధాని మోదీయే దీనికి బాధ్యత వహించాలి. మోదీ గారూ.. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్‌ను తొలగించండి. నీట్ పరీక్ష కోసం 22 లక్షల మంది విద్యార్థులు రెండేళ్లపాటు, రాత్రీ, పగలూ కష్టపడ్డారు. కానీ, వారి శ్రమ అంతా వృథా అయిపోయింది. నీట్ పరీక్షకు రెండు రోజుల ముందు నీట్ పేపర్ వాట్సాప్‌లో షేర్ అయిందనే విషయం దేశం మొత్తానికి తెలుసు. కానీ, దేశ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రం ఈ విషయంతో తనకేం సంబంధం లేదంటారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, వారి సహచరులు, వీసీలు, ప్రొఫెసర్లు కలిసి యూనివర్సిటీల్లో విద్యావ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇక్కడ వీసీ కావాలనుకుంటే ఎలాంటి జ్ఞానం, అనుభవం అవసరం లేదు. ఆర్ఎస్ఎస్తో సంబంధం ఉందా.. అంతే.. వీసీ అయిపోవచ్చు.
ఒకవేళ మీ సిద్ధాంతాలు ఆర్ఎస్ఎస్కు దూరంగా ఉంటే మాత్రం మీరు వీసీ అవ్వలేరు. దేశంలో 80 సార్లు పేపర్ లీకేజీలు జరిగాయి. రెండు కోట్ల మంది యువత జీవితాలు నాశనమయ్యాయి. మోదీజీ వెంటనే స్పందించి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించాలి. పేపర్ లీకేజీ నిందితుల్ని జైలుకు పంపించాలి” అని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.