లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని, దాంతో మోదీ సర్కార్ నియంతృత్వ పోకడలకు కాలం చెల్లిందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 400కుపైగా సీట్లు సాధిస్తామన్న వారి నినాదం తేలిపోయిందని, దీంతో ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో వాతావరణం మారిపోయిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తన నిర్ణయాలను చాలావరకూ మార్చుకుంటూ యూటర్న్ తీసుకుంటున్నదని ఎద్దేవా చేశారు.
ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం పట్ల ప్రజలు ప్రస్తుతం సందేహాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. యూపీ పర్యటన సందర్భంగా సచిన్ పైలట్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. యూపీలో పదిస్ధానాలకు త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి మొత్తం 10 సీట్లనూ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ నిస్సహాయ స్ధితిలో కూరుకుపోయిందని ఈ ప్రభావం ఉప ఎన్నికల్లోనూ ఉంటుందని, తమ కూటమి ప్రస్తుతం పటిష్టంగా ఉందని సచిన్ పైలట్ పేర్కొన్నారు.
నిరంకుశ పోకడలతో మోదీ ప్రభుత్వం ఎంతోకాలం మనగలగదని వారికి అర్ధమవుతున్నదని చెప్పారు. కాగా ఉన్నతోద్యోగాల్లో లేటరల్ ఎంట్రీ విధానంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవడంతో ఈ ప్రకటనను కేంద్ర ప్రభుత్వం వెనక్కితీసుకున్న సంగతి తెలిసిందే. లేటరల్ ఎంట్రీ ద్వారా రిజర్వేషన్లకు తూట్లు పొడవాలని మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని విపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష నేతలు కాషాయ సర్కార్‌పై భగ్గుమన్నారు. దీంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం యూపీఎస్సీ జారీ చేసిన ప్రకటనను నిలిపివేసింది.
Read More :
CBI | జగన్ విదేశి పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని కోర్టును కోరిన సీబీఐ