Jharkhand | ధన్బాద్, జూన్ 14: రైలు బోగీలో నిప్పంటుకుందన్న వదంతి ముగ్గురు ప్రయాణికుల ప్రాణాలను బలిగొంది. అగ్నిప్రమాద భయంతో ససారం ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ నుంచి బయటకు దూకిన ప్రయాణికుల్లో ముగ్గురు అదే సమయంలో పక్క పట్టాలపై వస్తున్న గూడ్స్ రైలు కింద పడి మరణించారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి 8 గంటలకు జార్ఖండ్లో చోటుచేసుకుంది.
రాంచీ-ససారం ఎక్స్ప్రెస్ ధన్బాద్ డివిజన్లోని కుమందిహ్ రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్న సమయంలో రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుందని కొందరు వదంతి రేపారు. దీంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కొందరు ప్రయాణికులు ప్రాణభయంతో నడుస్తున్న రైలు నుంచి కిందకు దూకేశారు. అదే సమయంలో పక్కనున్న పట్టాలపై గూడ్స్ రైలు వస్తుండటంతో దాని కింద నలిగి ముగ్గురు మరణించారు.
రైలులో అగ్నిప్రమాదం జరిగినట్టు గుర్తు తెలియన వ్యక్తి నుంచి కుమందిహ్ స్టేషన్కు ఫోన్ వచ్చిందని ధన్బాద్ డివిజనల్ రైల్వే మేనేజర్ తెలిపారు. దీంతో రైలును ఆపి తనిఖీ చేయగా, ఎలాంటి ప్రమాదం జరగలేదని, కేవలం వదంతి మాత్రమేని తెలిసిందన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మావోయిస్టుల ప్రభావం ఉన్న ఏరియా కావడంతో, దీని వెనుక ఉగ్రవాద కోణం ఏమన్నా ఉందా అన్న విషయాన్ని దర్యాప్తు చేస్తున్నామన్నారు.