Enforcement Directorate | హైదరాబాద్, మార్చి 10 (నమస్తే తెలంగాణ)(స్పెషల్ టాస్క్ బ్యూరో): మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కు కేంద్రం చేసిన సవరణలను సుప్రీంకోర్టు సమర్థించడం పట్ల విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ఈడీకి విస్తృత అధికారాలు కట్టబెట్టేలా సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని గత ఆగస్టు నుంచి విపక్షాలు అంటున్నాయి. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలకు మరింత ఊతం ఇచ్చే విధంగా టీఎంసీ, డీఎంకే, ఆప్, ఎన్సీపీ, ఎస్పీ, శివసేన, బీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఆర్ఎస్పీ, ఎండీఎంకే, ఆర్జేడీ, ఆర్ఎల్డీ, ఐయూఎంఎల్ తదితర పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తూ సంయుక్తంగా ప్రకటన విడుదల చేశాయి. ఈ తీర్పును పునఃసమీక్షించాల్సిందేనని డిమాండ్ చేశాయి. తీర్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు పేర్కొన్నాయి. ఈ అంశంపై త్వరలోనే విస్తృత ధర్మాసనం సమీక్షిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశాయి. ‘ప్రమాదకరమైన తీర్పు స్వల్పకాలికంగా ఉంటుందని, త్వరలోనే రాజ్యాంగబద్ధమైన నిబంధనలు అమలులోకి వస్తాయని ఆశిస్తున్నాం’ అని విపక్షాలు పేర్కొన్నాయి. సుప్రీంకోర్టుపై తమకు గౌరవం ఉన్నదని, అయితే చట్టంలోని లొసుగులు పరిశీలించకుండా తీర్పు ఇవ్వడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించాయి. ఇలా ఉండగా పీఎంఎల్ఏ చట్టానికి చేసిన సవరణలను కొట్టివేయాలని కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంతో పాటు 240 మంది సుపీ్రంకోర్టులో సవాల్ చేయగా, చట్ట సవరణలన్నీ సరైనవేనని కోర్టు సమర్థించింది.
పీఎంఎల్ఏ చట్ట సవరణ అంశంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చట్టాన్ని దుర్వినియోగం చేయాలని ధర్మాసనం ఎక్కడా చెప్పలేదు. చట్టాన్ని జాగ్రత్తగా వాడాలని సూచించింది. ఈ చట్టంపై ఏకాభిప్రాయం రావాలి. ఈ అంశాన్ని సుప్రీంకోర్టుతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్తాం.
– ఈ చట్ట సవరణ సందర్భంగా 2022, ఆగస్టులో విపక్షాలు
ఈడీ విచారణకు పిలిచినంత మాత్రాన ఆ వ్యక్తి తప్పు చేసినట్టు కాదు. కేసులో ఆధారాలు సేకరించేందుకే విచారణ జరుగుతున్నట్టు గమనించాలి. వ్యక్తి వాంగ్మూలాన్ని ఒక ఆధారంగా పరిగణిస్తారు. ఆ ఒక్క ఆధారం మాత్రమే సదరు వ్యక్తిని దోషిగా తీర్మానించలేదు.
– తాజుద్దీన్ వర్సెస్ యూనియన్ గవర్న్మెంట్ కేసులో సుప్రీంకోర్టు