CM Siddaramaiah | బెంగళూరు, సెప్టెంబర్ 27: ముడా స్కామ్లో కర్ణాటక కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కేసు నమోదైంది. ప్రజా ప్రతినిధుల ప్రత్యేక కోర్టు ఆదేశాల మేరకు లోకాయుక్త పోలీసులు శుక్రవారం మైసూరులో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో సిద్ధరామయ్యను ఏ1గా, ఆయన భార్య బీఎం పార్వతిని ఏ2గా, బావమరిది మల్లికార్జున స్వామిని ఏ3గా, దేవరాజును ఏ4గా పేర్కొన్నది. దేవరాజు వద్ద నుంచే మల్లికార్జున స్వామి భూమిని కొని పార్వతికి బహుమతిగా ఇచ్చాడని చెప్తున్నారు. తక్కువ విలువ కలిగిన ఈ భూమిని అభివృద్ధి పనుల కోసం మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) సేకరించి, పరిహారంగా పార్వతికి ఖరీదైన 14 స్థలాలను కేటాయించిందనే ఆరోపణలు ఉన్నాయి.
స్నేహమయి కృష్ణ అనే సమాచార హక్కు చట్టం కార్యకర్త సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సిద్ధరామయ్యపై విచారణ చేసేందుకు గవర్నర్ అనుమతించగా, ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు సైతం విచారణ జరగాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ప్రజా ప్రతినిధుల కేసులు విచారించే ప్రత్యేక కోర్టు సిద్ధరామయ్యపై కేసు నమోదు చేయాలని లోకాయుక్త పోలీసులను బుధవారం ఆదేశించింది.
సిద్ధరామయ్యపై సీబీఐ ద్వారా విచారణకు ఆదేశించాలని కోరుతూ ఆర్టీఐ కార్యకర్త స్నేహమయి కృష్ణ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానున్నది. లోకాయుక్త విచారణ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉంటుందని అనుకోవడం లేదని, సీబీఐ ద్వారానే విచారణ జరిపించాలని కోర్టును కోరారు.
సీబీఐకి సాధారణ సమ్మతిని ఉపసంహరించుకుంటూ సిద్ధరామయ్య మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది ముడా స్కామ్లో సీబీఐ విచారణ నుంచి తప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ప్రయత్నమని బీజేపీ అధికార ప్రతినిధి షెహ్జాద్ పూనావాలా పేర్కొన్నారు. చట్టం నుంచి తప్పించుకునేందుకు ఒక కరుడుగట్టిన దొంగ ఎలాంటి ప్రయత్నం చేస్తాడో కాంగ్రెస్ కూడా అదే చేసిందని విమర్శించారు. ప్రొఫెషనల్ దొంగగా, రాజకీయ పార్టీగా కాంగ్రెస్ స్పందించిందని పేర్కొన్నారు.