చండీగఢ్: హర్యానాలో ఓటమి తప్పదనుకున్న బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది. అయితే, ఈ విజయంలో ఆరెస్సెస్ కీలకపాత్ర పోషించినట్టు తెలుస్తున్నది. 2020-21 రైతుల ఉద్యమం, మనోహర్‌లాల్ ఖట్టర్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను ఆరెస్సెస్ ముందుగానే గుర్తించి బీజేపీని అప్రమత్తం చేసింది. ఖట్టర్‌ను మార్చాలని సైతం ఆరెస్సెస్ సిఫార్సు చేసినట్టు సమాచారం. దీంతో పాటు గ్రామీణ ఓటర్ల విశ్వాసాన్ని మళ్లీ నిర్మించుకునేందుకు సహకరించాల్సిందిగా ఆరెస్సెస్‌ను బీజేపీ కోరింది. దీంతో ప్రతి జిల్లాకు 150 మంది చొప్పున ఆరెస్సెస్ వలంటీర్లు క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగారు. దాదాపుగా 16 వేల సమావేశాలను నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి వారి అభిప్రాయాన్ని మార్చుకునేలా ప్రచారం చేశారు. ఇది బీజేపీ గెలుపునకు దోహదపడింది.