Pahalgam Attack | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌పై చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. మోదీ ప్రభుత్వం తీసుకోబోయే ఎలాంటి చర్యలకైనా సిద్ధమని ఇప్పటికే పలు పార్టీలు ప్రకటించాయి. ఆర్ఆర్ఎస్ సైతం పరోక్షంగా మద్దతు ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. అహింస మన స్వభావమని.. కానీ, దాడులకు పాల్పడే వారికి గుణపాఠం చెప్పడం కూడా మన మతమేనన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. హిందూ మేనిఫెస్టో గురించి ఆయన మాట్లాడుతూ.. అందరూ దానిపై చర్చించాలన్నారు. పాకిస్తాన్ పేరు చెప్పకుండా ఆయన మాట్లాడుతూ అహింస మన ప్రాథమిక స్వభావమని.. మనం పొరుగువారిని ఎప్పుడూ ఇబ్బందిపెట్టమని.. కానీ కొందరు చెడుకు పాల్పడితే మార్గం ఏంటీ? అని ప్రశ్నించారు.
రాజు విధి ప్రజలను రక్షించడమని.. రాజు తన విధిని నిర్వర్తించాలన్నారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని అవలంబిస్తే.. రాజు తనపని తాను చేసుకుంటూ పోతారన్నారు. రాజు ప్రజలను రక్షించేందుకు రాజు తీసుకున్న చర్యలను ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. అహింస మన స్వభావం.. మన విలువ అన్నారు. కానీ, కొందరు ఏం చేసినా మారరు.. వారంతా ప్రపంచాన్ని ఇబ్బందిపెడుతూనే ఉంటారంటూ పాకిస్తాన్‌పై పరోక్షంగా మండిపడ్డారు. రాముడు సైతం రావణాసూరుడిని రాజ్య ప్రజల కోసమే చంపారని.. అది హింస కాదన్నారు. ఎవరైనా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే తప్పని చెప్పి.. సరైన మార్గంలో నడిపించడం రాజు బాధ్యత.. ఇప్పుడు కూడా రాజు తన పని తాను చేసుకుంటూ పోతాడని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
ఈ దాడి ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న పోరాటమన్నారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని.. వాళ్లు ఉగ్రదాడులు చేస్తున్నారని.. దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ప్రజలను వారి మతం గురించి అడిగి చంపేశారని.. హిందువులు ఎప్పటికీ ఇలా చేయరన్నారు. ఇది మా స్వభావం కాదు.. ద్వేషమని.. శత్రుత్వం మన సంస్కృతిలో లేవన్నారు. ఉగ్ర దాడి దేశ ప్రజలను ఎంతో వేధనకు గురి చేసిందని.. ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉపేక్షించమన్నారు. తిరిగి చెల్లించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మనకు బలం లేకపోతే వేరే మార్గాన్ని ఎంచుకునే వారమని.. కానీ, ఇప్పుడు మనం బలవంతులం తప్పకుండా మన బలమేంటో శత్రువులకు చూపించాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యానించారు.