న్యూఢిల్లీ, మే 16: ప్రజలపై మళ్లీ పెట్రో పిడుగు పడనున్నదా? అవుననే అంటున్నారు ఆర్థికవేత్తలు. పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.10 వరకు మరింత పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దేశీయ ఇంధన రిటైల్ మార్కెట్లో దాదాపు 90% వాటాను కలిగి ఉన్న ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు(ఓఎంసీ) శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచాయి. అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల నడుమ ముడి చమురు ధరలు పెరుగుతూ ఉండటం, పశ్చిమాసియా యుద్ధాన్ని ముగించేందుకు జరుగుతున్న శాంతి చర్చలు అనిశ్చితిలో కొనసాగుతుండటంతో ఈ చర్య తీసుకున్నారు. ఇంధనం, వంటగ్యాస్, పాల ధరల పెరుగుదల కారణంగా రానున్న నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 0.42% మేర పెరిగే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు పేర్కొన్నారు.
ముడి చమురు ధరల పెరుగుదలను తట్టుకోవడానికి ఓఎంసీలు సమీప భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.10 వరకు పెంచవచ్చని ఆర్థిక సేవల సంస్థ ఎంకే గ్లోబల్ అంచనా వేసింది. ఒకేసారి లేదా 2, 3 వారాల వ్యవధిలో లీటరుకు రూ.10 పెంపుతో సుమారు 50% నష్టాలను భర్తీ చేయవచ్చని ఆశిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఏడాది మార్చి 27న కేంద్ర ప్రభుత్వం ఇంధన దిగుమతులపై లీటరుకు రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పటికీ ప్రస్తుతం ఓఎంసీలు తాము విక్రయించే ప్రతి లీటర్ ఇంధనంపై రూ.17-18 నష్టపోతున్నాయని ఆర్థిక సంస్థ నివేదిక అం చనా వేసింది. ఈ ఖర్చులను ఓఎంసీలే భరిస్తున్నందున ఈ త్రైమాసికంలో ఆ కంపెనీలు ఏకంగా ఏకంగా 570 నుంచి 580 మిలియన్ డాలర్ల (రూ.57,000-58,000 కోట్ల) నష్టాన్ని చవిచూడనున్నాయి. దీంతో ఈ వ్యాపారం నిలకడలేనిదిగా మారనున్నది.