చెన్నై: ఒక ఇంట్లో దొంగతనం చేసిన దొంగలు తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఫుల్గా మద్యం సేవించి రైల్వేస్టేషన్లో మత్తుగా నిద్రపోయారు. చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే ఆ దొంగలను అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. మాంబళం ప్రాంతానికి చెందిన గణేష్ బాబు ఒక ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పని ముగించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే డోర్ తెరిచి ఉండటం, ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడేసి ఉండటం చూసి షాక్ అయ్యాడు. ఏడు బంగారు ఆభరణాలు, రూ.50,000 నగదు చోరీ అయినట్లు గ్రహించాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కాగా, గణేష్ ఇంట్లో చోరీకి పాల్పడిన దొంగలు దీనిని సెలబ్రేట్ చేసుకోవాలని భావించారు. చోరీ చేసిన డబ్బు నుంచి రెండు వేలతో మద్యం తాగారు. మధ్య రాత్రి వేళ ఎగ్మోర్ రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. మొదటి లోకల్ రైల్లో ప్రయాణించాలని భావించి స్టేషన్లో నిద్రపోయారు.
మరోవైపు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చోరీ గురించి తెలుసుకున్న పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో సిబ్బందిని అలెర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో రైల్వే స్టేషన్లో నిద్రపోతున్న వ్యక్తులు ధరించిన డ్రెస్ ద్వారా ఆ దొంగలను జీఆర్పీ పోలీసులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి అరెస్ట్ చేశారు.
అంబత్తూర్కు చెందిన పెయింటర్ అయిన 37 ఏళ్ల అబ్దుల్ కరీమ్, పాడికి చెందిన 29 ఏళ్ల ఆటోడ్రైవర్ కుమార్ను దొంగలుగా పోలీసులు గుర్తించారు. వారి బ్యాగ్లో ఉన్న బంగారు ఆభరణాలు, రూ.48,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా, కొన్ని గంటల్లోనే చోరీ అయిన బంగారం, డబ్బును దొంగల నుంచి పోలీసులు రికవరీ చేయడం గురించి తెలుసుకున్న గణేష్ ఆశ్చర్యపోయాడు.