Cashless Treatment | రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు (road accident victims) నగదు రహిత చికిత్సను (cashless treatment) అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర రహదారుల రవాణాశాఖ విడుదల చేసింది. నేటి నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.
రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందు కోసం కేంద్రం ‘క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ స్కీం-2025’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఎవరైనా రోడ్డు ప్రమాదంలో గాయపడితే చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుంది.
ప్రమాద ఘటన జరిగిన 24 గంటల్లోగా పోలీసులకు సమాచారాన్ని అందిస్తేనే ఈ స్కీం ద్వారా నగదు రహిత చికిత్సను పొందొచ్చు. బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రోగులకు ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులనూ ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్లో సూచించింది.
Also Read..
Road Accident | బస్సు లోయలో పడటంతో ఇద్దరు మృతి.. 40 మందికిపైగా గాయాలు
Baglihar Dam | బాగ్లిహార్ డ్యామ్ నుంచి పాకిస్థాన్‌కు స్వల్పంగా నీటి విడుదల.. Video