Road accident : వ్యాన్ను లారీ ఢీకొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని సిధి జిల్లా (Sidhi district) లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. తెల్లవారుజామున 2.30 గంటలకు సిధి-బహ్రి (Sidhi-Bahri) రహదారిపై ఉప్నీ పెట్రోల్ పంప్ (Upni petrol pump) సమీపంలో మైహర్ వైపు వెళ్తున్న వ్యాన్ను.. సిధి నుంచి బహ్రి వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం రేవా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దాంతో ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. మిగతా క్షతగాత్రులు సిధి జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. బాధితులకు సరైన చికిత్స అందేలా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.