(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): తన తండ్రి ఎవరో నిజాన్ని బయటపెట్టాలంటే డీఎన్ఏ టెస్టుకు అనుమతించాలంటూ ఓ కొడుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. తనకు పుట్టని బిడ్డకు ఆర్థిక సాయం ఎలా చేస్తానంటూ ఆ ఇద్దరు తండ్రులు న్యాయస్థానం ముందు వాపోయారు. పితృత్వం, చట్టబద్ధమైన భావనకు సంబంధించిన 20 ఏండ్ల కిందటి అత్యంత సున్నితమైన ఈ కేసులో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భుయాన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం ఎట్టకేలకు కీలక తీర్పు వెలువరించింది.
1989లో కేరళకు చెందిన 23 ఏండ్ల ఓ యువతికి వివాహమైంది. 1991లో కుమార్తె జన్మించింది. 2001లో కుమారుడు పుట్టాడు. అయితే, భర్తతో భేదాభిప్రాయాలు రావడంతో 2003 నుంచి ఆమె అతనికి దూరంగా ఉంటున్నది. 2006లో వీరికి విడాకులు మంజూరయ్యాయి. విడిపోయిన భర్త నుంచి తనకు, తన కొడుక్కి భరణం అందుతున్నది. ఈ క్రమంలో రికార్డుల్లోని తన కుమారుడి తండ్రి పేరును మార్చాలంటూ సదరు మహిళ కొచ్చి మున్సిపల్ కార్పొరేషన్లో దరఖాస్తు చేసుకొన్నది. తనకు ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండేదని, అతని వల్లే తనకు కొడుకు పుట్టాడని పేర్కొన్నది. అయితే, తండ్రి పేరు మార్పునకు కోర్టు ఆదేశాలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. దీంతో ఆమె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డీఎన్ఏ టెస్టు చేయడానికి కింది కోర్టు అంగీకరించింది. కొడుకు తనకు పుట్టలేదని తెలుసుకొన్న చట్టబద్ధమైన తండ్రి.. విడాకులు ఇచ్చిన భార్యకు మాత్రమే భరణం ఇస్తూ.. కుమారుడికి ఇవ్వాల్సిన డబ్బును నిలిపేశాడు.
డీఎన్ఏ టెస్టు చేయాలన్న కింది కోర్టు ఆదేశాలను మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొన్న వ్యక్తి హైకోర్టులో సవాల్ చేశాడు. ఆమెకు పుట్టిన కొడుక్కి తాను తండ్రి కాదని వాదించాడు. మహిళకు కొడుకు పుట్టేప్పుడు ఆమె, తన భర్తతోనే కలిసి ఉన్నదని, విడాకులు మంజూరు కాలేదని గుర్తు చేశాడు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 సెక్షన్ 112 ప్రకారం.. వివాహ బంధం కొనసాగే సమయంలో లేదా వివాహబంధం ముగిసిన 280 రోజుల్లోపు పుట్టిన బిడ్డకు చట్టబద్ధంగా ఆ మహిళ భర్తే.. తండ్రిగా వ్యవహరిస్తారన్న నిబంధనలను ఉటంకించాడు. దీంతో తల్లి, కొడుకుల వాదనలను కోర్టు పక్కనబెట్టింది. 2015లో కొడుక్కి ఆరోగ్య సమస్యలు తలెత్తి పలు సర్జరీలు అయ్యాయి. దీంతో తన ఆరోగ్య అవసరాలు, చదువు కోసం తన తండ్రి నుంచి భరణం ఇప్పించాల్సిందిగా కొడుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీన్ని వివాహేతర బంధం కలిగిన తండ్రి సవాల్ చేశాడు. వాదనలు విన్న హైకోర్టు.. చట్టబద్ధత అనే విషయాలను పక్కనబెడితే.. కొడుకు పుట్టుకకు కారణమైన తండ్రే డబ్బు సాయం చేయాలంటూ 2018లో తీర్పునిచ్చింది. దీంతో వివాహేతర బంధం కలిగిన తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
తన పుట్టుక సమయంలో తన తల్లిదండ్రులు వేర్వేరుగా ఉంటున్నట్టు పిటిషనర్ అయిన కొడుకు నిరూపించలేకపోయాడని వివాహేతర బంధం కలిగిన వ్యక్తి తరుఫు న్యాయవాది వాదించాడు. దీంతో డీఎన్ఏ టెస్ట్, భరణాన్ని ఏ హక్కుతోనూ అతను కోరలేడని పేర్కొన్నాడు. ఈ వాదనను పరిగణనలోకి తీసుకొన్న సుప్రీంకోర్టు.. డీఎన్ఏ టెస్టు చేయడాన్ని తోసిపుచ్చింది. సరైన ఆధారాలు లేకుండా డీఎన్ఏ టెస్టు పేరిట ఓ వ్యక్తి గోప్యతకు భంగం కలిగించలేమని పేర్కొంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, 1872 సెక్షన్ 112 ప్రకారం.. కొడుకు జన్మించినప్పుడు ఎవరైతే ఆ భార్యకు భర్తగా ఉంటారో.. అతనే ఆ కొడుక్కి చట్టబద్ధమైన తండ్రి అంటూ తీర్పునిచ్చింది.