Karnataka Congress | కర్ణాటక (Karnataka) కాంగ్రెస్ (Congress)లో మరోసారి ముసలం మొదలైంది. పదవుల పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. అధికారంలోకి రాగానే సీఎం పదవి కోసం డీకే శివకుమార్ (DK Shivakumar), సిద్ధరామయ్య (Siddaramaiah) తలపడగా మరోసారి అత్యున్నత పదవి కోసం కాంగ్రెస్‌లో కుమ్ములాటలు జోరందుకున్నాయి. సీఎం పదవి నుంచి సిద్ధరామయ్యని తప్పించి ఆ స్థానంలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ను కూర్చోబెట్టాలంటూ మెజారిటీ ఎమ్మెల్యేలు గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వేళ డీకే శివకుమార్ బీజేపీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇప్పుడు తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
డీకే, సిద్ధరామయ్య వర్గీయులు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు మాటల యుద్ధానికి దిగుతున్నారు. ఈ క్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు అని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి కేఎన్ రాజన్న (KN Rajanna) బీజేపీలో చేరబోతున్నారంటూ ఎమ్మెల్యే హెచ్‌సీ బాలకృష్ణ (MLA HC Balakrishna) ఇటీవలే కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజన్న రాష్ట్ర సహకార మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై వ్యతిరేక గళం వినిపించడంతోనే ఆయనను గత నెల పదవి నుంచి తప్పించారు.
ఈ నేపథ్యంలో తన తండ్రి రాజన్న పార్టీ మారుతున్నారని ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ, మాజీ మంత్రి తనయుడు రాజేంద్ర రాజన్న (Rajendra Rajanna) తీవ్రంగా స్పందించారు. బీజేపీలో చేరే బృందంలో బాలకృష్ణ ఉన్నారంటూ ఆరోపించారు. సీఎం పదవి కోసం పాకులాడుతున్న నేత (డీకే శివకుమార్‌ను ఉద్దేశించి) వెంట వెళ్లబోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన తండ్రికి వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ డీకే పేరును ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. తాము సీఎం సిద్ధరామయ్యకు సన్నిహితులం కాబట్టే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి పదవి పోవడం వెనుక రహస్య హస్తం ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. ఇలా సిద్ధరామయ్య, డీకే వర్గీయులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం కర్ణాటక కాంగ్రస్‌లో మరోసారి అలజడి మొదలైంది.
Also Read..
GST Council meeting | మరికాసేపట్లో జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం
Red Alert: రికార్డు స్థాయిలో వర్షాలు.. పంజాబ్, హిమాచల్, జమ్మూకశ్మీర్‌లో రెడ్ అలర్ట్