న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. జమ్మూకశ్మీర్, లడాఖ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిశాలోని కొన్ని జిల్లాలకు భారతీయ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్(Red Alert) జారీ చేసింది. ఐఎండీ ప్రకారం ఆయా జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో భారీగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడడం లాంటి ఘటనలు చోటుచేసుకునే అవకాశం ఉన్నది.
జమ్మూకశ్మీర్‌లోని పూంచ్, మిర్పుర్, రాజౌరి, రియాసీ, జమ్మూ, రాంబన్, ఉదంపూర్, సాంబా, కథువా, దోడా, కిష్టావర్తో పాటు పంజాబ్‌లోని కపుర్తలా, జలంధర్, నవాన్షార్, రూప్‌నగర్, మోగా, లుథియానా, బర్నాలా, సంగ్రూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, ఉనా, బిలాస్‌పుర్, సిర్మౌర్, సోలన్ కూడా వార్నింగ్ ఇచ్చారు. హర్యానాలోని యమునా నగర్, అంబాలా, కురుక్షేత్ర, పంచకుల, ఎస్ఏఎస్ నగర్ కు కూడా వార్నింగ్ జారీ చేశారు.
నదీ పరివాహక ప్రాంతాల్లో నిరవధికంగా వర్షాలు పడుతున్న కారణంగా.. సుక్నా లేక్ గేట్లను చండీఘడ్ అడ్మినిస్ట్రేషన్ ఓపెన్ చేసింది. సుక్నా డ్యామ్‌లో నీటి సామర్థ్యం 1163 ఫీట్లకు చేరుకుని డేంజర్ మార్క్ దాటింది. అదనపు నీటిని ఘాజర్ నదిలోకి వదులుతున్నారు. ఈ వర్షాకాలంలో సుక్నా డ్యామ్ గేట్లను ఎత్తడం ఇది తొమ్మిదోసారి. మండి జిల్లాలోని సుందేర్‌నగర్ డివిజన్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈఘటనలో ఆరుగురు మృతిచెందారు.