ప్రతిపక్ష పార్టీల్లో చీలికలు నేడు దేశంలో రాజకీయ దుమారం రేపుతున్నాయి. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ముక్కలు చెక్కలు కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలో శివసేన (యూబీటీ) మరోసారి నిలువునా చీలిపోయింది. ఇక తాజాగా ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో కూడా చీలిక రావొచ్చన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. కేంద్రంలోని అధికార బీజేపీనే ప్రతిపక్ష పార్టీల్లో చీలికల చిచ్చు రాజేస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. కేసులతో భయపెట్టి, ప్రలోభాలతో లొంగదీసుకొని ఎంపీలు, ఎమ్మెల్యేల ద్వారా ఆయా పార్టీల్లో తిరుగుబావుటా ఎగురవేయించి, తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని పేర్కొంటున్నారు. గతంలో మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలిక తెచ్చి, ఉద్ధవ్ సర్కారును కూల్చి మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి శివసేనలో చీలిక తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. అలాగే బెంగాల్లోనూ తిరుగుబావుటా ఎగురవేసిన 20 మంది రెబల్ ఎంపీలు కూడా ఎన్డీయేకు మద్దతు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు ఎస్పీని చీల్చడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అడ్డు తొలగించుకోవాలని బీజేపీ యత్నిస్తున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ, జూన్ 17: పశ్చిమ బెంగాల్‌లోని తృణమూల్ కాంగ్రెస్‌లో కల్లోలం, మహారాష్ట్ర శివసేన(యూబీటీ)లో చీలిక రానున్నదన్న వదంతుల నడుమ ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చీలిక రావచ్చనే ఊహాగానాలు మంగళవారం వెలుగులోకి వచ్చాయి. ఎస్పీ నుండి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరుగవచ్చని రాష్ట్ర మంత్రి, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓపీ రాజ్‌భర్ వెల్లడించడంతో ఈ ఊహాగానాలు మొదలయ్యాయి. అవినీతి కేసులపై ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు రాంగోపాల్ యాదవ్ కేంద్రాన్ని సంప్రదించారని, పార్టీ ఫిరాయించడానికి పలువురు నాయకులు సిద్ధమవుతున్నారని ఎక్స్ వేదికగా రాజ్‌భర్ ఆరోపించారు. సమాజ్‌వాదీ పార్టీలో భారీ చీలిక రాబోతున్నది. రామ్ గోపాల్ యాదవ్ కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు ఒక లేఖ సమర్పించారు. మైనింగ్ కుంభకోణం, గోమతీ నదీ తీర అభివృద్ధి కుంభకోణం వెనుక ఉన్న సూత్రధారి ఎవరో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతి ఒక్కరికీ తెలుసు. చట్టం ఉచ్చు బిగుసుకుంటుండటంతో ఎస్పీ ఆందోళన చెందుతున్నది అని ఆ పోస్టులో ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్ర, బెంగాల్‌ను మరచిపోండి. యావత్ ఎస్పీ బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉంది అని రాజ్‌భర్ పేర్కొన్నారు.
వచ్చే ఏడాది జరగనున్న ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య జోస్యం చెప్పారు. బుధవారం కాన్పూర్ను సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమాజ్‌వాదీ పార్టీ రాజకీయ పతనం సమీపిస్తున్నదని అన్నారు. సుమారు 25 నుంచి 26 మంది ఎస్పీ ఎంపీలు పార్టీ నుంచి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. అయితే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించే రాజకీయాలకు బీజేపీ పాల్పడబోదని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్పీలో తలెత్తిన అంతర్గత విభేదాలు ఎన్నికల సమయం ఆసన్నమైన కొద్దీ బహిర్గతం అవుతాయని ఆయన అన్నారు.

ఈ ఆరోపణలపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. ఉత్తరప్రదేశ్ మంత్రి వ్యాఖ్యలను, ఉద్దేశాలను ప్రశ్నిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో బీజేపీ అనేక పార్టీల్లో చీలికలు సృష్టించిందని, యూపీలో ఎస్పీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తమ వైపునకు తిప్పుకొందని అఖిలేశ్ పేర్కొన్నారు. నేను ఏదైనా లేఖ సమర్పించానా లేదా అనేది మీరు అమిత్ షాను అడగాలి. దేశంలో ఎవరూ ఓం ప్రకాష్ రాజ్‌భర్‌ను సీరియస్‌గా తీసుకోరు. ఆయనెప్పుడూ ఇలాగే మాట్లాడుతుంటారు. అసలు తానేం మాట్లాడుతున్నానో ఆయనకే తెలియదు అని విలేకరులతో మాట్లాడుతూ అఖిలేశ్ అన్నారు. బీజేపీ నాయకులు ఉపయోగించే కథలనే రాజ్‌భర్ కూడా చెబుతున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారం ఇంకెంతకాలం సాగుతుంది? మీకు తిండి పెట్టేవాళ్ల భాషే కదా మీరు మాట్లాడేది అని అఖిలేశ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని, సరైన సమయంలో వారు తమ నిర్ణయాన్ని వెల్లడిస్తారని ఆయన చెప్పారు.
అంతా ఊహించినట్టుగానే శివసేన (యూబీటీ)లో చీలిక చోటుచేసుకుంది. ఆపరేషన్ టైగర్ పేరుతో అధికారి పార్టీ చేపట్టిన ఈ ఫిరాయింపుల కార్యక్రమంలో ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేసి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీలో విలీనం అయ్యేందుకు సిద్ధపడగా, ముగ్గురు ఎంపీలు మాత్రం ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి తమ విధేయత ప్రకటించారు. పార్టీ విభజనకు అవసరమైన సంఖ్యలో ఆరుగురు ఎంపీలు ఉండటంతో పార్టీ చీలిక లాంఛనం కానుంది. ఆరుగురు లోక్‌సభ రెబల్ ఎంపీలు తమను పార్లమెంటరీ ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరుతూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖను సమర్పించారు. కాగా, ఎంపీలు అరవింద్ సావంత్ (ముంబై దక్షిణం), అనిల్ దేశాయ్ (ముంబై దక్షిణ మధ్య), రాజబాబు వేజ్ (నాసిక్)లు తాము ఉద్ధవ్ ఠాక్రే వెంటే ఉంటామని బుధవారం తమ విధేయతను బహిరంగంగా పునరుద్ఘాటించారు.

శివసేన (యూబీటీ)లో ఎంపీల ఫిరాయింపులు చోటుచేసుకుంటున్న క్రమంలో ఠాక్రే సన్నిహితుడు, ఎంపీ సంజయ్ రౌత్ రెబల్ ఎంపీలపై తీవ్ర ఆరోపణలు చేశారు. షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలోకి వెళ్లేందుకు ఒక్కో ఎంపీకి రూ. 50 కోట్ల ధరను నిర్ణయించారని విమర్శించారు. ‘ప్రతి ఎంపీ కనీస మద్దతు ధరను రూ.50 కోట్లు నిర్ణయించారు. రూ.15 కోట్లను అడ్వాన్స్‌గా చెల్లించారు. తర్వాత మాత్రమే వారు ప్రత్యేక చార్టెర్డ్ విమానాలు ఎక్కారు’ అని రౌత్ పేర్కొన్నారు. ఫిరాయింపు ఎంపీలను తీసుకుని ప్రత్యేక విమానాలు నాందేడ్, పుణె సహా వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి బయలుదేరాయని ఆయన తెలిపారు. ‘వారికి కనీసం రిక్షాలో ప్రయాణించే స్థోమత కూడా లేదు. ఠాక్రే పేరుకున్న విలువ కారణంగా ప్రైవేట్ జెట్లలో ప్రయాణించే స్థాయికి వారి విలువ పెరిగిపోయింది’ అని అన్నారు. ఈ సందర్భంగా రెబల్ ఎంపీలపై ఆయన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. తన మాటలను సెన్సార్ చేయవద్దని మీడియా చానళ్లను కోరారు.
గత రెండు వారాలుగా దేశంలో అనూహ్య రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయా పార్టీల్లో చీలికలు, తిరుగుబాట్లకు, కేంద్రం తీసుకొచ్చిన డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధం ఉన్నదని విశ్లేషకులు చెబుతున్నారు. అధికార ఎన్డీఏకు 54 ఓట్లు తక్కువ కావడంతో రాజ్యాంగ సవరణ బిల్లును ఏప్రిల్‌లో మోదీ సర్కార్ ఆమోదించుకోలేక పోయింది. అయితే ఇప్పుడు మళ్లీ ఆ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకునే లక్ష్యంతోనే దేశంలో ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నట్టు పరిశీలకులు భావిస్తున్నారు. ఇటీవల టీఎంసీ, శివసేన (యూబీటీ)లో తిరుగుబాట్లను చూస్తే ఎన్డీఏ కూటమి బలం పెంచుకునే చర్యలే అని అర్థమవుతున్నది. ప్రస్తుతం టీఎంసీ ఎంపీలు 20, శివసేన (యూబీటీ) ఎంపీలు ఆరుగురు కలిస్తే ఎన్డీఏ బలం అదనంగా 26 సీట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఇండియా కూటమితో విభేదించిన తమిళనాడులోని స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వారితో కేంద్రం ఇప్పటికే చర్చలు జరుపుతున్నది. వారు ఎన్డీఏకు మద్దతు ఇస్తే రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించుకోవడానికి ఇంకా ఆరుగురు ఎంపీలు మాత్రమే అవసరమవుతారు.
కోల్‌కతా, జూన్ 17 : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ ముక్కలు చెక్కలు అయినా వెనక్కి తగ్గేదే లేదు అంటూ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ క్షేత్రస్థాయిలో బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పోరుబాటకు దిగారు. ఎటువంటి పునరావాసం కల్పించకుండా కోల్‌కతాలోని వీధి వ్యాపారులను తొలగించరాదని డిమాండ్ చేస్తూ నగరంలో భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వ చర్య కారణంగా రోడ్డుపై, ఫుట్‌పాత్‌లపై వ్యాపారం చేసుకునే వేలాది వీధి వ్యాపారుల కుటుంబాలు రోడ్డున పడతాయని మమత పేర్కొన్నారు. పునరావాసం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు కల్పించిన తర్వాతే వారిని ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు.