Interim Budget 2024 : 2024-25 ఆర్ధిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న మధ్యంతర బడ్జెట్లో ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంతో పోలిస్తే వ్యయంలో పదిశాతం పెరుగుదల ఉంటుందని భావిస్తున్నారు. ఆర్ధిక వృద్ధి నిలకడగా పెరగడంతో పాటు ఆర్ధిక స్ధిరీకరణ చర్యలకు కట్టుబడి ఉండేలా కేంద్ర ప్రభుత్వం ఆచితూచి బడ్జెట్ గణాంకాలకు తుదిరూపు ఇచ్చిందని చెబుతున్నారు.
2023-24 ఆర్ధిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి రేటును అంచనా వేస్తున్న క్రమంలో ఆర్ధిక స్ధిరీకరణ, నిలకడతో కూడిన వృద్ధిపై ప్రభుత్వం కసరత్తు సాగిస్తోంది. గత ఏడాది వ్యయం 14.1 శాతం పెరిగి బడ్జెట్ రూ. 45 లక్షల కోట్లకు పెరిగింది. ఈ ఆర్ధిక క్రమశిక్షణను కొనసాగిస్తూ రానున్న బడ్జెట్లో వ్యయం కేవలం 10 శాతం పెరగనుంది.
రానున్న ఆర్ధిక సంవత్సరంలో నాణ్యమైన వ్యయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుండటంతో మూలధన వ్యయంపై పెద్ద ఎత్తున నిధులు వెచ్చించేందుకు ప్రభుత్వం మొగ్గుచూపనుంది. 2026 ఆర్ధిక సంవత్సరం నాటికి ద్రవ్యలోటును జీడీపీలో 4.5 శాతానికి తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించుకుంది. మూలధన వ్యయం ప్రధానంగా మౌలిక సదుపాయాలపై వ్యయాన్ని భారీగా పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుండగా లోక్సభ ఎన్నికల అనంతరం జూన్లో పూర్తిస్ధాయి బడ్జెట్ను నూతన ప్రభుత్వం ప్రవేశపెడుతుంది.
Read More :