Caste Census : కుల గణనపై మోదీ సర్కార్ ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదని కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి ప్రశ్నించారు. కుల గణన చేపట్టాలని రాహుల్ గాంధీ దేశానికి దిక్సూచిగా నిలిచారని చెప్పారు. కుల గణన ఎందుకు చేపట్టాలనే దానిపై రాహుల్ సమగ్ర కారణాలతో వివరించారని గుర్తుచేశారు. రేణుక చౌదరి సోమవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. కుల గణన చేపట్టాలని దేశ ప్రజలంతా కోరుతున్నారని అన్నారు.
కుల గణన నిర్వహించకుండా ప్రభుత్వాన్ని నిలువరిస్తున్న కారణాలేంటని ఆమె నిలదీశారు. కాషాయ పాలకులకు ఇష్టం ఉన్నా లేకున్నా కుల గణన జరుగుతుందని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే దేశవ్యాప్తంగా కుల గణన నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇక, జన గణన నిర్వహించకపోవడం మోదీ ప్రభుత్వ బలహీనతను వెల్లడిస్తోందని కర్నాటక మంత్రి, కాంగ్రెస్ నేత ప్రియాంక్ ఖర్గే అంతకుముందు పేర్కొన్నారు. గణాంకాలు లేకపోవడంతో మోదీ ప్రభుత్వం విధాన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని దుయ్యబట్టారు. ప్రియాంక్ ఖర్గే సోమవారం బెంగళూర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
ఎన్డీయే అంటే నో డేటా అవైలబుల్ అని ఆయన అభివర్ణించారు. మరోవైపు రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి, బీజేపీ నేత రవ్నీత్ బిట్టూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు.బీజేపీ నేతలు చిత్తశుద్ది కోల్పోయారని తాను భావిస్తు్న్నానని చెప్పారు. రాహుల్ గాంధీకి వేర్పాటువాదులు, ఉగ్రవాదులే వత్తాసు పలుకుతారని బిట్టూ తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తనకు తెలిసినంత వరకూ ఉగ్రవాదులు పార్లమెంట్ సభ్యులు కాలేరని అన్నారు. రాహుల్‌ను విమర్శించాలనుకునే వీరంతా తామే చెడుగా చిత్రీకరింపబడతారని వ్యాఖ్యానించారు. కాగా, అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి రవ్నీత్ సింగ్ బిట్టూ తీవ్రంగా ఖండించారు.
Read More :
MLA KP Vivek | కౌశిక్‌రెడ్డిపై దాడికి సీఎం రేవంత్ రెడ్డే సూత్రధారి: ఎమ్మెల్యే కేపీ వివేక్