Bengaluru : బెంగళూరు నగరవాసులకు కర్ణాటక హైకోర్టు ఊరటకలిగించే తీర్పునిచ్చింది. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా బైక్ టాక్సీలకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది ప్రయాణికులకే కాకుండా.. బైక్ టాక్సీ నడిపే నిరుద్యోగ యువతకు కూడా ఎంతో మేలు చేస్తుంది. బైకులు నడిపే కెప్టెన్లు ఇకపై చట్టబద్ధంగా బైకులు నడుపుకోవచ్చు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ విభు బక్రు, జస్టిస్ సీఎం జోషితో కూడిన ధర్మాసనం వాహనదారులకు అనుకూలంగా శుక్రవారం తీర్పునిచ్చింది.
బైకు టాక్సీలు చెల్లుబాటు కావంటూ గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. బైకులు టాక్సీలుగా కొనసాగేందుకు.. అంటే మనుషుల్ని రవాణా చేసేందుకు పనికిరావని, వాటిని రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై గత ఏడాది ఏప్రిల్ లో హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. దీని ప్రకారం.. బైకుల్ని టాక్సీలుగా వాడకూడదని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ ఉబర్ సహా పలు సంస్థలు తిరిగి కోర్టును ఆదేశించాయి. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం బైకుల్ని కూడా టాక్సీలుగా పరిగణించాలని ప్రభుత్వానికి నేడు ఆదేశాలు జారీ చేసింది. మోటారు వాహన చట్టం ప్రకారం.. బైకుల్ని టాక్సీలుగా నడిపేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతులివ్వాలని సూచించింది.
కొత్త దరఖాస్తుల్ని కూడా తీసుకోవాలని, అనుమతులిచ్చేముందు బైకుల పనితీరు, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఇతర ప్రమాణాల్ని పరిశీలించాలని సూచించింది. టాక్సీగా నడిపే ప్రతి బైకును రిజిష్టర్ చేయాలని ఆదేశించింది. ఈ తీర్పు విషయంపై కర్ణాటక ప్రభుత్వం స్పందించింది. ఇప్పటికే ఈ విషయంలో ప్రభుత్వం ప్రమాణాల్ని పాటిస్తోందని, తమ పాలసీ అనుకూలంగా ఉందని, కొత్త పాలసీ అవసరం లేదని వ్యాఖ్యానించింది.