చండీగఢ్: హర్యానాలో అధికార బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ బాగా పుంజుకుంది. మొత్తం 10 సీట్లలో మూడింటిలో విజయం సాధించగా, రెండింటిలో పూర్తి ఆధిక్యంలో ఉంది. 2019 ఎన్నికల్లో 10 సీట్లను దక్కించుకున్న బీజేపీ ఇప్పుడు సగం పోగొట్టుకుని ఐదింటితోనే సరిపెట్టుకుంది.
అన్ని స్థానాల్లో పోటీ చేసిన జేజేపీ, నాలుగు స్థానాల్లో పోటీ చేసిన ఐఎన్ఎల్డీ, తొమ్మిదింటిలో బరిలోకి దిగిన బీఎస్పీకి డిపాజిట్లు దక్కలేదు. బీజేపీ మాజీ సీఎం ఖట్టర్ కర్నీ లోక్సభ స్థానంలో భారీ ఆధిక్యంలో ఉన్నారు. కర్నల్ అసెంబ్లీ ఉప ఎన్నికలో హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ 41,540 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న క్రమంలో ఈ ఎన్నికల్లో ఓటింగ్ 28.42 నుంచి 43.68 శాతానికి పెరగడం కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాము గెలుస్తామని మాజీ సీఎం హుడా ధీమా వ్యక్తం చేశారు.